HMDA | సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పనితీరు మారింది. గతంలో మాదిరి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టే విధానం నుంచి, కొత్త విధానంలో పనులు చేపడుతామని చెబుతూనే కాలయాపన చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ట్రాన్సాక్షనల్ అడ్వైజరీలు(టీఏ) చెబితే గానీ పనులు చేపట్టలేకపోతుంది. సమగ్ర విధి విధానాలపై స్వయంగా పరిశీలన చేయాల్సిన అవసరం లేకుండానే.. వడ్డించిన విస్తరి తరహా పని విధానానికి మొ గ్గు చూపుతుంది. ఇలా కీలకమైన ప్రాజెక్టుల విషయంలో టీఏల నియామాకం పేరిట కాలయాపన జరుగుతుంది. ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, పనులు ఎప్పుడూ చేపడుతుందనేది అంతు చిక్కని ప్రశ్న.
అభివృద్ధిలో కీలకం హెచ్ఎండీఏ
హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే హెచ్ఎండీఏ.. ట్రాన్సాక్షనల్ అడ్వైజరీ పేరిట కొత్త పని విధానాన్ని అమలు చేస్తోంది. నగరానికి తలమానికమైన ఎన్నో ప్రాజెక్టులను టీఏల పేరిట జాప్యం చేస్తోంది. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ వంటి విషయాలను సొంతంగా అధ్యయనం చేసే హెచ్ఎండీఏ, ఇప్పుడు ఏజెన్సీల చేతికి బాధ్యతలు అప్పగించి చోద్యం చూసేందుకు సిద్ధమైతుంది. ఇప్పటికీ మూడు కీలకమైన ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేకంగా ట్రాన్సాక్షన్ అడ్వైజర్లను నియమించుకుంటుం ది. జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు, అదే విధంగా ప్యారడైజ్ నుంచి డెయిర్ ఫాం రోడ్డు వరకు నిర్మించనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లు, మీరాలం కేబుల్ బ్రిడ్జితో పాటు, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అభివృద్ధి విషయంలో టీఏలను నియమించుకోనుంది.
టీఏల నియామాకం.. పనుల్లో జాప్యం
హెచ్ఎండీఏ చేపట్టనున్న కీలకమైన ప్రాజెక్టుల విషయంలో టీఏ నియామాకం వలన ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థికపరమైన, ఇతర అంశా ల్లో సాధ్యాసాధ్యాలను అంచనా వేసే బాధ్యతలను టీఏలను ఆశ్రయిస్తుండగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు ఆ సంస్థ అందించే వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్మాణానికి ప్రధానమైన ఆర్థిక వనరులు, వినియోగం, నిర్వహణ భా రం వంటి రెవెన్యూ పరమైన అంశాలపై అంచనా వే సే ఈ టీఏలూ ఇచ్చే సలహాలు మాత్రమే కీలకంగా మారుతున్నాయి. అదే విధంగా ట్రాన్సాక్షనల్ అడ్వైజరీ సంస్థలే ప్రాజెక్టు ఒప్పంద వ్యవహారాలు, రెవె న్యూ సంబంధిత అంశాలను పర్యవేక్షించనుంది. నిర్మాణానికి ముందు డెవలపర్లతోనూ ఈ సంస్థనే చర్చలు జరపనుంది. ఆయా కంపెనీల ఆర్థికమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని హెచ్ఎండీఏకు దిశానిర్దేశం చేయనుంది. ఇలా ఒకప్పుడు హెచ్ఎండీఏ యంత్రాంగం చేయాల్సిన విధులు, బాధ్యతల ను ఏజెన్సీలకు అప్పగించి, పనిభారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. టీఏల నియామానికే కీలకసమయం పోతుండగా, ఆ సంస్థలు నివేదికలు రూ పొందించే వరకు ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమిత మవుతున్నాయ అభిప్రాయం వ్యక్తమవుతోంది.