మేడ్చల్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విచారణలో త్రీవ జాప్యం జరుగుతోంది. నగర శివారులో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల విచారణ ముందుకు సాగడం లేదు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 34 గ్రామ పంచాయతీల పరిధిలో లక్షా 20 వేల దరఖాస్తులు వచ్చాయి. అనుమతి లేకుండా విక్రయించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు వీలు కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ. 1000 రుసుముతో ప్లాట్లు, రూ.10 వేల రుసుముతో వెంచర్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. దీంతో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో దరఖాస్తుల విచారణను ప్రారంభించిన విషయం తెలిసిందే. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా విచారణ చేస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విచారణలో దరఖాస్తుదారులు హైడ్రా వల్లే ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చినా అధికారుల వద్దకు రాకపోవడం వల్లే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విచారణ అంతగా ముందుకు సాగడం లేదని సమాచారం. ప్రసుత్తం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చెరువులు వద్దనున్న లే అవుట్ల వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించిన క్రమంలో రెగ్యులరేజేషన్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దరఖాస్తుదారులు విచారణకు ముందుకు రావడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, ఎల్ఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తుల విచారణలో ప్రభుత్వ భూమి, చెరువు, బఫర్ జోన్, స్థానిక అవసరాలకు కేటాయించిన భూమి ఉంటే అనుమతులను నిరాకరించనున్నారు. దీంతో లే అవుట్ యజమానులతో పాటు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులు ముందుకు వెళ్లడం లేదని సమాచారం.
జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు లక్షా 20 వేలు ఉంటే, ఇప్పటి వరకు విచారించింది ఐదువేల దరఖాస్తులు మాత్రమే. అయితే, మూడు నెలల్లో మిగతా దరఖాస్తుల విచారణ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పని కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులలో 75 శాతానికి పైగా దరఖాస్తులలో పూర్తి సమాచారం లేకపోవడంతో దరఖాస్తుదారుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు వినియోగించుకోవడం లేదు. హైదరాబాద్ నగరంలో హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ తరుణంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విచారణలో దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని స్వయంగా దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.