
మియాపూర్, డిసెంబరు 20 : ప్రభుత్వం 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నదని ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కోరారు. ఇందుకోసం ఈ నెల 31లోగా తమ నల్లా కనెక్షన్‌తో ఆధార్ సంఖ్యను తప్పక అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. జలమండలి భాగ్యనగర్ సెక్షన్ జలమండలి అధికారులతో విప్ గాంధీ సోమవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలుత ఆగస్టు15 వరకే ఉన్న ఆధార్ అనుసంధానం గడువును ప్రజల సౌకర్యం కోసం డిసెంబరు 31 వరకు పొడిగించిందని, గడువులోగా తప్పక ఈ ప్రక్రియను అర్హులైన ప్రజలు పూర్తి చేసుకోవాలన్నారు. అర్హులైన వారంతా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయాలని విప్ గాంధీ సూచించారు. నల్లాలకు రూ. 1300 మీటరు, రూ. 200తో బిగింపునకు ధర చెల్లించాలని, జలమండలి కార్యాలయాల్లో అవి అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం ప్రభాకర్, డీజీఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.