జీడిమెట్ల, డిసెంబర్ 30: ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి పడి మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కోనకానమెట్ల మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన చెంచురామయ్య(45) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జీడిమెట్ల ఎస్‌ఆర్‌నాయక్‌నగర్‌లో ఉంటూ బోల్లారంలోని థర్మల్ సిస్టమ్స్‌లో పని చేస్తున్నాడు.
కాగా, చెంచు రామయ్య కుటుంబం ఎస్‌ఆర్‌నాయక్ నగర్‌లోని ఓ ఇంటి నాలుగో అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి 9 గంటలకు చెంచురామయ్య సిగరెట్ తాగేందుకు నాలుగవ అంతస్తు పైకి ఎక్కాడు. అక్కడే గోడపై కూర్చుని సిగరెట్ తాగుతుండగా.. ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అతను ఎంతకు ఇంట్లోకి రాకపోవడంతో అటు నుంచి అటే నైట్ డ్యూటీకి వెళ్లాడని రామయ్య భార్య విజయలక్ష్మి భావించింది.
సోమవారం తెల్లవారుజామున వాచ్‌మన్ వచ్చి రామయ్య బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెంది ఉన్నాడని మృతుడి భార్యకు తెలిపాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.