
కుత్బుల్లాపూర్, జోన్ బృందం, డిసెంబర్ 20: ధాన్యం కొనకుంటే బీజేపీకి గోరీకట్టక తప్పదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు. రైతుల పాలిట బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై గులాబీ శ్రేణులు, రైతులు తిరగబడ్డారు. కేంద్రానికి చావు డప్పు వినిపించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో యాసంగి వడ్లు ఒక్క కిలో కూడా తీసుకోలేమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో తేల్చిచెప్పడంతో పార్టీ శ్రేణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిమైసమ్మలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు, నల్లచొక్కాలు ధరించి ప్లకార్డులు పట్టుకుని భారీ ర్యాలీ తీశారు. అనంతరం గండిమైసమ్మ చౌరస్తాలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ధాన్యాన్ని కొనాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో గొప్పలు చెప్పుకున్న బండి సంజయ్‌కి దమ్ముంటే కేంద్రంలో మోదీని ఒప్పించి రాష్ట్రంలో పండిన పంటలను కొనేలా చేయాలన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాయమాటలు చెబుతూ, ఉనికి చాటుకోవాలని చూసుకోవడం సరికాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని బండి చేసే కుట్రలను యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలారెడ్డి, మున్సిపాలిటీల చైర్మన్లు సుంకరి కృష్ణవేణి, సన్నా శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.