శేరిలింగంపల్లి, జూలై16: సైబరాబాద్లో బీ ఎన్ ఎస్ ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలి ఆస్తి అటాచ్మెంట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ తెలిపారు. కొండాపూర్లోని తెలుగు ఫుడ్స్ కార్యాలయంలో పనిచేసే వేణుగోపాల్ డబ్బులను దారి మళ్లించినట్లు మూడు నెలల కిందట గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
వేణుగోపాల్ తమ బంధువులకు అకౌంట్లోకి డబ్బులను వేసి వారికి కొంత కమీషన్ ఇచ్చి భారీ ఎత్తున డబ్బులు కూడా పెట్టాడు. విచారణ చేపట్టి కొల్లగొట్టిన డబ్బుతో ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలంలో భూమిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్రైమ్ నంబర్ 416/2025 ఆస్తిని అటాచ్ చేయాలని మాదాపూర్ డీసీపీ వినీత్ అనుమతి ఇచ్చారు. 14 ఎకరాల భూమిని అటాచ్ చేస్తున్నట్లు కూకట్పల్లి 10వ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాచర్ల షాలిని ఉత్తర్వులు జారీ చేశారు. గచ్చిబౌలి ఎస్ హెచ్ ఓ అబీబుల్లాఖాన్, ఎస్ఐ అనిల్ కుమార్ ను డీసీపీ అభినందించారు.