Darpan | సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తప్పిపోయిన పిల్లలు, వివిధ కారణాలతో కుటుంబాల నుంచి విడిపోయిన పిల్లలను ‘దర్పణ్’ అనే ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌తో గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మహిళా, శిశు సంరక్షణ విభాగం డీసీపీ సృజన కర్ణం తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని సోమవారం నిర్వహించిన ఆపరేషన్-11 సమీక్షలో సృజన మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 1నుంచి 31వరకు నెలరోజులపాటు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా వెట్టిచాకిరీ చేస్తున్న బాలకార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, ట్రాఫికింగ్‌కు గురైన పిల్లలను గుర్తిస్తున్నామన్నారు. అంతే కాకుండా తప్పిపోయిన పిల్లలను ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌తో గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ స్మైల్ కోసం కమిషనరేట్ పరిధిలో మొత్తం 11 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని ఒక్కో బృందంలో ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారని వివరించారు.
ఆపరేషన్ స్మైల్‌పై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి, కుటుంబాలకు దూరమైన చిన్నారులను చేరదీసి, తిరిగి వారి కుటుంబాలకు అప్పజెప్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళా, శిశు సంరక్షణ విభాగం ఏసీపీ వి.ప్రసన్నకుమార్, చైల్డ్వెల్ఫేర్ కమిటి ప్రతినిధి కె.నరేందర్‌రెడ్డి, బచ్పన్ బచావో ఆందోళన్ స్టేట్ కోఆర్డినేటర్ అందె వెంకటేశ్వర్లు, జిల్లా శిశు సంరక్షణ అధికారులు ఎండి.ఇంతియాజ్, రత్నం పాల్గొన్నారు.