సిటీబ్యూరో, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యానికి హాని కలిగించే విడి నూనె విక్రయాలపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన హెచ్ ఫాస్ట్ విభాగం ఆదివారం బేగంబజార్‌లోని కార్యాలయంలో నూనె తయారీదారులు, సరఫరాదారులతో అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టాస్క్‌ఫోర్స్ డీసీపీ, హెచ్‌ఫాస్ట్ ఇన్చార్జి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వంటనూనెల వ్యాపారంలో పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలపై వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు.
వ్యాపారులు తమ పనితీరును మార్చుకోవడానికి 15 రోజుల గడువు విధించామని, ఈలోగా విడి నూనె విక్రయాలను పూర్తిగా నిలిపివేసి వందశాతం ప్యాకేజింగ్, బ్రాండింగ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. గడువు మగిసిన తర్వాత విడి నూనెలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. మార్కెట్లో విక్రయించే ప్రతీ నూనె ప్యాకెట్ లేదా టిన్ సీల్ చేసి ఉండాలని, ప్రతీ ప్యాకెట్‌పై తయారీ, గడువు తేదీలతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నెంబర్‌ను స్పష్టంగా ముద్రించాలన్నారు. నూనెలో తక్కువ రకం నూనెలను కలపడం, హానికరమైన రసాయనాలను వాడడం వంటి చర్యలకు పాల్పడితే వారి లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా కఠిన శిక్ష తప్పదని గైక్వాడ్ హెచ్చరించారు.
వ్యాపారులు లాభం కంటే ప్రజల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండి తక్కువ ధరకు వస్తుందని విడి నూనె కొనకుండా స్వచ్ఛమైన నూనెలను కొనుగోలు చేయాలని డీసీపీ గైక్వాడ్ సూచించారు. ఈ సమావేశంలో హెచ్ ఫాస్ట్ ఇన్స్పెక్టర్లు రంజిత్‌కుమార్ గౌడ్, ఎం.అంజయ్య, సబ్ఇన్స్పెక్టర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.