ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌కు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనల్లో అసాంఘిక శక్తులు చేరే అవకాశం ఉందని ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. పరిస్థితులను దెబ్బతీసి, ప్రశాంత వాతావరణన్ని చెడగొట్టే ప్రయత్నాలు జరగవచ్చని చెప్పారు. ఈ విషయాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్, సిఐ రాజేందర్ లతో కలిసి ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. సర్క్యులర్ కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని, దీనికి అవకాశం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులు ఓయూలో చొరబడి అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని విశ్వసనీయవర్గాల నుంచి తమకు సమాచారం అందిందని చెప్పారు. అసాంఘిక శక్తుల ఆకర్షణలకు లోను కాకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు చేరవేయాలని సూచించారు. ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు.