సిటీబ్యూరో: దేహదారుఢ్యం కోసం వినియోగించే స్టెరాయిండ్స్ను అనుమతి లేకుండా విక్రయిస్తున్న ఓ దుకాణంపై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. రూ. 2 లక్షల విలువ చేసే 22 రకాల స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…నగరానికి చెందిన రాకేశ్ కొండియా కోఠి ఈసామియాబజార్లో ‘రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్’పేరుతో దేహదారుఢ్యానికి సంబంధించిన పలు రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు.
డీసీఏ అనుమతులు లేకుండా 22 రకాల స్టెరాయిడ్స్ ఔషధాలను జిమ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నాడు. డీసీఏ అధికారులు శుక్రవారం సదరు దుకాణంపై దాడులు జరిపి, స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్ బోయిని శ్రీకాంత్‌యాదవ్ మియాపూర్‌లోని ఆర్బీఆర్ కాంప్లెక్స్‌లో ‘శ్రీకాంత్ న్యూరో సెంటర్’ పేరుతో హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నాడు.
అదే దవాఖానలో డీసీఏ అనుమతి లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపును సైతం నిర్వహిస్తున్నాడు. డీసీఏ అధికారులు హాస్పిటల్‌పై దాడులు జరిపి, రూ.1.01లక్షల విలువ చేసే ఔషధాలను సీజ్ చేశారు.