సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): నగరంలోని మలక్‌పేట, జడ్జస్ కాలనీలో ఉన్న హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు ఔషధాలు విక్రయిస్తున్నారు. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు ఆ హాస్పిటల్‌పై దాడులు జరిపారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం… నగరంలోని మలక్‌పేట, జడ్జస్ కాలనీలో ఉన్న హైదరాబాద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో కొంత కాలంగా ఔషధాలను ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.
దీంతో రంగంలోకి దిగిన డీసీఏ అధికారులు గురువారం సదరు దవాఖానపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో భాగంగా వాంతులు, వొకారం సంబంధిత చికిత్సకు వినియోగించే జోఫర్ ఇంజక్షన్ ధర రూ.13.35 ఉండగా హైదరాబాద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రం రూ.150కు అంటే ఎంఆర్పి ధర కంటే రూ.136.65కు అధికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలర్జీ సంబంధిత చికిత్సకు వినియోగించే అవిల్ ఇంజక్షన్ ధర రూ.6.16 ఉండగా హాస్పిటల్లో మాత్రం రూ.100కు విక్రయిస్తున్నారు.
రూ.22.03 గల నార్మల్ స్లైన్‌ను రూ.180కు విక్రయిస్తున్నారు. అలాగే స్పఫాస్ట్-డి ఇంజక్షన్‌ను ఎంఆర్పి కంటే రూ.72కు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఎంఆర్పి కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఔషధాలకు సంబంధించిన బిల్లులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు ఎసెన్షియల్ కమ్మోడిటిస్ చట్టం 1955 రెడ్ విత్ డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ డి.సరిత, మలక్‌పేట డ్రగ్ ఇన్స్పెక్టర్ జి.అనిల్, సికింద్రాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గోవింద్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.