DCA | సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా అక్రమంగా ఔషధాలు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీపై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.2కోట్ల విలువ చేసే ఔషధాలను సీజ్ చేసి, సదరు తయారీ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. డీసీఏ డీజీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, బొల్లారం గ్రామంలోని ‘అక్రాన్ ఫార్ములేషన్స్ ఇండియా ప్రై.లి.’ అనే ఫార్మా కంపెనీ డీసీఏ అనుమతి తీసుకోకుండా, ఔషధాలు తయారు చేయడానికి అవసరమైన ఎలాంటి వసతులు లేకుండానే అక్రమంగా ఎస్పర్ఫ్లెక్స్ క్రీమ్, మెడ్పుర ఆయింట్మెంట్, అమోనియం లాక్టేట్ లోషన్, అమోనియం లాక్టెట్ క్రీమ్‌లను పెద్ద ఎత్తున తయారు చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు మంగళవారం సదరు తయారీ కంపెనీపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.2కోట్ల విలువ చేసే ఔషధాలను సీజ్ చేసి, ఔషధ తయారీ కంపెనీకి నోటీసులు జారీచేశారు.
మరో కేసులో నకిలీ ఔషధాలు సీజ్
అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలకు వినియోగించే ‘మాంటెక్-ఎల్సి’ నకిలీ టాబ్లెట్లు సరఫరా చేస్తున్న పలు ఫార్మా ఏజెన్సీలపై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో మలక్‌పేట, సంతోష్‌నగర్‌లోని హైపర్ ఫార్మా ఎజెన్సీలో పెద్ద ఎత్తున నకిలీ మాంటక్-ఎల్సి టాబ్లెట్లను గుర్తించి సీజ్ చేశారు. ఈ మేరకు సదరు ఏజెన్సీతో పాటు తయారీ కంపెనీకి నోటీసులు జారీచేశారు.