ఖైరతాబాద్, నవంబర్ 22: డేటా, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ గవర్నెన్స్‌కు కీలకమని హైదరాబాద్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ అధ్యక్షుడు ఆనందరావు పొట్నూరు అన్నారు. శనివారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) ఆధ్వర్యంలో ‘ఫైనాన్స్ కాన్క్లేవ్ 2025’ ది పార్క్ హోటల్లో జరిగింది. ‘నావిగేటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఏ డైనమిక్ గ్లోబల్ ఎకానమీ’ థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక వాతావర ణంలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై ప్రతినిధులు చర్చించారు.
ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరస్పరం అనుసంధానమై ఉందని, ఒక దేశంలోని విధాన మార్పులు మరో దేశ మార్కెట్లపై ప్రభావం చూపే స్థితిలో ఉన్నాయని చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అధ్యక్షుడు చరణ్ జోత్‌సింగ్ నందా మాట్లాడుతూ.. నేటి పరిస్థితు ల్లో ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కేవలం సంఖ్యల పరిమితిని దాటి వ్యూహాత్మక సలహాదారులుగా మారారన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ వీవీ రామరాజు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్ సీమా గ్రోవర్, ఎంఈఐఎల్ గ్రూప్ సీఎఫ్‌వో సలీల్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.