హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి రాక్షస పాలనలో హోర్డింగ్ కార్మికులపై,హైడ్రా జులుం ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సెలవు దినాల్లో బాలాపూర్ చౌరస్తాలో అనుమతులు ఉన్న హోర్డింగ్‌లను తొలగించడం ఎంత వరకు సమంజసమన్నారు. వేలాది నిరుపేద కుటుంబాల జీవనాధారాన్ని రేవంత్ప్రభుత్వం నాశనం చేస్తున్నదని ఆదివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. పెద్ద బిల్డర్లు చెరువుల్లో ఆకాశహర్మ్యాలు కడుతుంటే చోద్యం చూస్తున్న సర్కారు పేదలపై ప్రతాపం చూపడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.
హోర్డింగ్‌లను తొలగించిన అధికారులు మెటీరియల్‌ను అమ్ముకుంటున్నారని వ్యాపారులు సంచలన విషయాలను బయటపెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వ్యాపారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకొని హైడ్రా దుర్మార్గాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు