బంజారాహిల్స్,సెప్టెంబర్ 4: టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం కోసం నూతన కమిటీల ఏర్పాటును ఈ నెల 12లోగా పూర్తి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బస్తీ కమిటీల ఏర్పాటుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కసరత్తు ప్రారంభించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలో ముందుగా బస్తీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగా ఆయా డివిజన్లకు చెందిన సిట్టింగ్ కార్పొరేటర్లతో సంప్రదించి కమిటీలను ఖరారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 120కి పైగా బస్తీలున్నాయి. ప్రతి బస్తీలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేసిన వారితో పాటు ప్రారంభం నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులతో బస్తీ కమిటీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే సూచనలు జారీ చేశారు.
బస్తీ కమిటీలో అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు కార్యదర్శి, కార్యదర్శి, కోశాధికారితో పాటు ఆరుగురు కార్యవర్గ సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50శాతం కమిటీలో ఉండేలా చూడాలని, బస్తీల్లో జనాభా ఎక్కువగా ఉంటే కమిటీలో సభ్యులను 15నుంచి 25మందిదాకా పెంచుకోవచ్చని పార్టీ అధిష్టానం సూచనలు జారీ చేసింది.
టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసిన, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. పార్టీని నడిపించేది క్షేత్రస్థాయిలో కార్యకర్తలే. వారికి బస్తీ కమిటీల్లో చోటు కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంచడం కోసం ప్రయత్నిస్తాం. బూత్‌స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బస్తీ కమిటీ ద్వారా ప్రయత్నించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలు చేశారు. ఆయన సూచనలకు అనుగుణంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత లభించేలా కార్పొరేటర్లు, డివిజన్ నేతలతో కలిసి కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. సెప్టెంబర్ 12లోగా కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తాం.-దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే