Congress Govt | ఖైరతాబాద్, జనవరి 22 : దశాబ్దాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న పేదల బతుకులు రోడ్డున పడ్డాయి. 40 ఏండ్లుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న వారి జీవనాధారం నేలమట్టమైంది. బుధవారం ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సంయుక్తాధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని చింతలబస్తీలో ఆక్రమణల పేరుతో చేపట్టిన కూల్చివేతలతో సుమారు 100 మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారు. సుమారు 145 మంది పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది గట్టి బందోబస్తు మధ్య నాలుగు జేసీబీలతో బుధవారం ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఎలాంటి నోలీసులు ఇవ్వకుండానే చిరు వ్యాపారాలను కూల్చివేయడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ బతుకులు కూల్చిండంటూ శాపనార్థాలు పెట్టారు. ‘మాకు దారి చూపకుంటే ఆత్మహత్యలే శరణ్యం’ అంటూ వాపోయారు.
బింతలబస్తీలో చిరువ్యాపారాల కూల్చివేతలు జరుగుతుండగా, అటువైపు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కూల్చివేతలను ఆపాలని, లేకుండా ఇక్కడే బైఠాయించి అవసరమైతే ధర్నా చేస్తానని హెచ్చరించారు. అయినా అధికారులు లెక్క చేయలేదు. ఈ నేపథ్యంలో నగరంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కూల్చివేతలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆ అధికారితో ఏం సంభాషణలు జరిగాయో తెలియదు. కూల్చివేతలు ఆపకుంటే ఇక్కడే కూర్చుంటానని చెప్పిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. అధికారులను హెచ్చరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రారంభమైన కూల్చివేతలు రాత్రి వరకు కొనసాగాయి. చింతలబస్తీలో రోడ్డు ఆక్రమణలను కూల్చివేస్తున్న క్రమంలో స్థానికులు కొందరు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆయన కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతలోనే బీజేపీ నేత దిలీప్ కుమార్ తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేశారు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కూల్చివేతలు కొనసాగాయి.
40 ఏండ్ల నుంచి ఇక్కడ కుండలు అమ్ముకుంటూ జీవిస్తున్నాం. శుభకార్యాలు జరిగినప్పుడు.. ఎండాకాలంలో మాత్రమే తమ కుండలకు గిరాకీ ఉంటుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న నా డబ్బాను కూల్చివేశారు. నా కుటుంబానికి దిక్కెవరూ. ఉద్యోగమేమైనా ఇస్తారా.. ఎలాంటి ఆసరా చూపకుండా ఎలా కూల్చివేస్తారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణానికి పాల్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా కొంపలను ముంచింది. మాకు ఇక దిక్కెవరూ.. ఎలా బతకాలి.
– పుష్ప, చింతలబస్తీ
సంవత్సరాల నుంచి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు ఇక్కడ వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్నాయి. ఇంత వరకు ఏ ప్రభుత్వం కూడా చిరు వ్యాపారులపై దాడులు చేయలేదు. రోజంతా కష్టపడి వ్యాపారం చేస్తే నోటికి ఇంత బువ్వ అందుతుంది. ఉన్న ఆ ఆధారాన్ని తొలగిస్తే పేదలు ఎలా బతకాలి. కూల్చివేతల్లోనూ అధికారులు కర్కషంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగుల ర్యాంపు లు, ఇంటి ముందు మెట్లు, ఫుత్పాత్లు, పార్కింగ్ కోసం చేసిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. వాహనాలు ఎక్కడ పార్కు చేసుకోవాలో షాపులను కూల్చివేస్తున్న అధికారులే సమాధానం చెప్పాలి. నెల రోజుల ముందు నోటీసులు ఇచ్చి కూల్చివేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కూల్చివేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు.
– అనిల్ చందర్, చింతలబస్తీ
నా కొడుకు కోడలు చిన్న డబ్బా దుకాణం పెట్టుకొని పేపర్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. నా కొడుకు చదివిన చదువుకు ఉద్యోగం రాక, ఈ చిన్న వ్యాపారం చేసుకొని భార్య, పిల్లలతో జీవిస్తున్నాడు. ఉన్న ఒక్క ఆధారాన్ని కూల్చివేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనికరం లేదు. కూల్చడానికి మా పేదల వ్యాపారాలే కావాలా….బడా బాబులు కబ్జాలు చేస్తే పట్టించుకోరు…. మా పేదలు చిన్న షెడ్డు వేసుకొని దుకాణం నడిపస్తుంటే విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడదు.
– అంజమ్మ, చింతలబస్తీ