కంటోన్మెంట్ : అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కార్యచరణ ఉండడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ వెల్లడించారు. కంటోన్మెంట్లోని బీఆర్ఎస్ అభ్యర్థి గ్యాని లాస్యనందిత (Lasya Nandita) క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
దళితుల(Dalit) అభ్యున్నతికి అంబేద్కర్ తరువాత అంతగా ఆలోచించిన మేధావి సీఎం కేసీఆర్(CM KCR) అని కొనియాడారు. దళితుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలుస్తారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులంతా పూర్తి మద్దతు అందించి వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ విజయానికి సహకరిస్తామని పేర్కొన్నారు.
వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అంటూ మోసం చేసిన బీజేపీ, వర్గీకరణ చేపట్టకుండా మాదిగ యువకుల ప్రాణాలను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీలకు మాదిగ, మాదిగ ఉప కులాలు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే వర్గీకరణ అంశం కనుమరుగు అవుతుందన్నారు. మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ(Modi) రాజకీయ ప్రసంగం తప్ప, మాదిగ జాతికి ప్రయోజనం గురించి మాట్లాడలేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు? అని ప్రశ్నించారు.
వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి ప్రతినిధుల బృందాన్ని పంపి మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేస్తున్న మోదీసర్కారుకు మందకృష్ణ మాదిగ మద్దతునివ్వడంపై మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మందకృష్ణ కుమ్మక్కై దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు.