షాద్‌నగర్, నవంబర్ 16 : ఫరూఖ్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రాజశేఖర్ అనే దళిత వ్యక్తిని కులదురహంకారంతో కొందరు వ్యక్తులు హత్యచేశారని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, కుల నిర్మూలన సంఘం అధ్యక్షుడు ఎండీ వహీద్లతో పలువురు నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఎర్ర రాజశేఖర్ హత్య ఉదంతం తెలుసుకున్న కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు షాద్‌నగర్ చౌరస్తాలో ఆదివారం సాయంత్రం నిరసనలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన యువతిని దళిత కులస్తుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో యువతి కుటుంబీకులు హత్యకు పాల్పడటం దురదృష్టకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గ్రామానికి చెందిన భావని, ఎర్ర చంద్రశేఖర్ మేజర్లు కావడంతో ప్రేమ వివాహం చేసుకున్నారని, ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఎర్ర చంద్రశేఖర్ సోదరుడు ఎర్ర రాజశేఖర్‌ను హత్య చేశారని మండిపడ్డారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన చోటుచేసుకునేది కాదని, పోలీసులు పట్టించుకోకపోవడంతోనే యువతి తండ్రి కావలి వెంకటయ్యతో పాటు ఆయన వర్గీయులు హత్యకు పాల్పడ్డారని చెప్పారు. షాద్‌నగర్ ప్రధాన చౌరస్తాలో నిరసనలు తెలుపడంతో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. హత్య నిందితులను చట్టపరంగా శిక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు నిరసనకారులకు తెలిపారు.
ఎర్ర రాజశేఖర్ హత్య ఘటన వెలుగుచూడటంతో ఎల్లంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పరువు హత్యగా ప్రచారం జరుగడంతో కులాల మధ్య ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు నిర్వహించారు. షాద్‌నగర్ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హత్యకు పాల్పడిన కావలి వెంకటయ్య ఇంటిపై దాడి చేసే అవకాశముందని తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకున్నామని షాద్‌నగర్ పోలీసులు తెలిపారు.