ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 : తెలంగాణ దళిత బంధు ద్వారా ఆ వర్గాలకు ఆర్థిక చేయూతనందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గిరిజనులకు, బీసీల్లోని పేద వర్గాల కోసం కూడా ఇలాంటి పథకం తీసుకురావాలన్నారు. ఏ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని, అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని అన్నారు. దళిత బంధును ఎవరూ వ్యతిరేకించినా దళిత ద్రోహులవుతారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని అభినందిస్తూ అక్టోబర్ 9న ఇందిరాపార్కు వేదికగా కృతజ్ఞత బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన బాలిక ఘటనలో నిందితుడిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందించాల్సిందేనని గజ్జెల కాంతం అన్నారు. ముక్కు పచ్చలారని బాలికకు జరిగిన అన్యాయానికి నిందితుడికి తగిన శిక్ష పడిందన్నారు.
హిందుత్వమని చెప్పుకొని తిరుగుతున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్.. కేంద్ర పాలకులు నల్ల రైతు చట్టాలు తీసుకువచ్చినప్పుడు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినప్పుడు హిందుత్వం గుర్తుకు రాలేదా.. హిందువులకు అన్యాయం జరగడం లేదా.. దీనిపై సమాధానం చెప్పాలని గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. భారతదేశంలో బీజేపీ పుట్టకముందే హిందుత్వం ఉన్నదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నూతన చైర్మన్‌గా నియమితులైన ఎంఎస్ సంతోష్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.