సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఆ కౌంటర్లో కూర్చోవడానికి సిబ్బంది పోటీ పడితే.. అక్కడ ఎవరిని కూర్చోబెడితే తనకు లాభమో వారికే ఆ కౌంటర్ కేటాయిస్తాడా అధికారి. అక్కడ జరిగే టికెట్ల గోల్మాల్ వ్యవహారం ఆషామాషీ కాదు. మంగళ, శుక్రవారాల్లో వచ్చే ఆదాయాన్ని కలుపుకుని రోజువారీగా సుమారు రూ.లక్ష ఆదాయం సమకూర్చే ఆ టికెట్ కౌంటర్‌కు గిరాకీ ఎంత ఉంటుందో ఆ కౌంటర్లో పనిచేసేందుకు ఉద్యోగుల తాకిడీ అదే స్థాయిలో ఉంటుంది.
అక్కడ కూర్చున్న వ్యక్తి టికెట్ల వ్యవహారంలో ఒక్కోనెల రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు అక్రమంగా వెనకేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అలాంటి బంగారుబాతు లాంటి కౌంటర్‌ను వదులుకోవాలంటే ఆ అధికారికి మనసెందుకు ఒప్పుతుంది. అందుకే ఆ బాతుపై కన్నేసి టికెట్ కౌంటర్లో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కూర్చోబెట్టి తన పని చక్కబెట్టుకుంటున్నాడని టాక్. అధికారం లేనప్పటికీ ఒకవైపు పెత్తనం చెలాయిస్తూనే మరోవైపు కౌంటర్లో టికెట్ల డబ్బులు గోల్మాల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
టికెట్ల విషయంలో గోల్మాల్!
నగరంలోనే ప్రముఖ దేవాలయంగా వెలుగొందుతున్న అమీర్‌పేట సమీపంలోని ఆ అమ్మవారి ఆలయంలో ఇటీవల దర్శన టికెట్ల విషయంలో గోల్మాల్ జరిగినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యేక దర్శనం రూ.50 టికెట్ విషయంలో ఆలయ అధికారిగా ..అనధికారికంగా కొనసాగుతున్న ఆ అధికారి చెప్పిన మేరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం చూపించాడని సమాచారం. ఆలయ నిర్వాహకులు వచ్చి టికెట్ల కౌంటర్ ఫైల్స్ ఇస్తున్నావేంటంటూ నిలదీసి లెక్కలు తేల్చే సరికి రూ.10 వేలు తేడావచ్చినట్లు గమనించినట్లు సమాచారం.
దీంతో ఆలయ నిర్వాహకులు ఏం జరిగిందంటూ అడగగా, ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగి డబ్బులను మొదట ఆలయ ముఖ్య అధికారికి ఇచ్చానని, ఆ తర్వాత ఒడిబియ్యం అతనికి ఇచ్చానని చెప్పడంతో మళ్లీ దందా మొదలైందా అని అడిగినట్లు ఆలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. జనవరి నెలలో టికెట్ల కుంభకోణంలో రూ.31 వేలు తేడా కనిపించగా అప్పట్లో ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఈ సారి ఒక్కరోజులోనే రూ.10వేల తేడా వచ్చిందని, ఈ లెక్కన ప్రతిరోజూ ఎంతమేరకు గోల్మాల్ జరుగుతుందోనన్న కోణంతో పాటు ఆ అధికారి చెప్పడంతోనే చేశానని ఆ తాత్కాలిక ఉద్యోగి చెప్పడంపై పెద్ద చర్చే జరుగుతోంది.
తేడా డబ్బులు కట్టించినప్పటికీ ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోకపోగా.. డీసీఆర్లో ఈ కౌంటర్ఫైల్స్ లెక్క ఎలా తేలుస్తారని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో చర్చిస్తున్నారు. పదిహేను ఇరవై రోజులుగా సుమారుగా పది లక్షలకు పైగా గోల్మాల్ జరిగి ఉంటుందని ఆ శాఖలో చెవులు కొరుక్కుంటున్నారు. టికెట్ల కౌంటర్ ఫైల్స్ తారుమారు చేయడం, టికెట్లు చించకుండా మళ్లీ అవే టికెట్లను సిబ్బందితో కలిసి తిరిగి ఇవ్వడం వంటి పనులను చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆ అధికారి తీరుపై ఆలయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధికారం లేకున్నా లక్షల రూపాయలకు చెక్కులిస్తూ అందులో కమీషన్లకు ఆశపడుతున్న ఆ అధికారి, ఇప్పుడు ఏకంగా టికెట్ల గోల్మాల్ వ్యవహారంలో ఆలయ నిర్వాహకులకే దొరికినా.. ఆ చిరుద్యోగిని బెదిరించి వేరేవారిపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆలయ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇటీవల బోనాల సమయంలో ప్రసాదం విషయంలోనూ తనకెంత వాటా ఇస్తారంటూ అడిగిన ఆ అధికారి ఇప్పుడు ఏకంగా టికెట్ల గోల్మాల్ వ్యవహారంలో తన బుద్ధిని ప్రదర్శించారని గతంలో ఆయన పని చేసిన ఆలయ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఆలయంలో గోల్‌మాల్‌పై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
నిమ్మకు నీరెత్తని అధికారులు
సదరు అధికారి చేతివాటంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని ఆ శాఖలోనే గుసగుసలాడుకుంటున్నారు. అమ్మవారికి భక్తులు ఇచ్చిన నగలు పోయినా అసలు ఆలయంలో ఎంత బంగారం ఉందో తేల్చాల్సిన జువెల్లరీ వెరిఫికేషన్ ఆఫీసర్‌ను కనీసం అటువైపు కూడా వెళ్లమనడం లేదంటే ఆ అధికారికి తాను చెప్పుకొన్నట్లుగా మంత్రి అండదండలు, పేషీ అధికారులకు ఇచ్చిన ముడుపుల బలం పెద్దదిగానే ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
అంతేకాకుండా దాతలు ఇచ్చే డబ్బులను కూడా పెద్ద మొత్తంలో గోల్మాల్ చేస్తున్నారని, ఆలయ అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను తమ సొంత పనులకు వాడుకుంటున్నారని ఆలయంలో ఆ అధికారికి వత్తాసు పలుకుతూ లెక్కలు తారుమారుచేస్తున్న ఉద్యోగులపై ఆరోపణలున్నాయి. 3 నెలల కాలంలో ఆలయ ఆదాయానికి రూ.20 లక్షలకు పైగా గండిపడి ఉంటుందని భక్తులు
చెప్పుకొంటున్నారు.