సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 37.0, కనిష్ఠం 27.0 డిగ్రీలు, గాలిలో తేమ 37శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.