బంజారాహిల్స్,ఏప్రిల్ 17: మీ క్రెడిట్‌కార్డు వేరే బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందంటూ.. కాల్ చేసి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని కమలాపురి కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ అవేజ్ అహ్మద్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుకు కోటక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తో లింక్ అయి ఉందని, దీన్ని హెచ్‌డీఎఫ్‌సీకి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పారు.
లింక్ మార్చుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లాలని, లేకుంటే ఫోన్లోనే చేసుకోవచ్చంటూ ఓ లింక్ పంపించారు. ఈ లింక్‌లో వివరాలు నమోదు చేయగానే అతడి క్రెడిట్ కార్డులో నుంచి రూ.85,156 కాజేసినట్లు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమయిన అవేజ్ అహ్మద్ 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి లావాదేవిని బ్లాక్ చేయించారు. ఈ మేరకు బాధితుడు గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.