సిటీబ్యూరో, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లను పట్టుకుని వారి నుంచి సొత్తు రికవరీ చేసి మళ్లీ ఆ సొత్తులో కొంత భాగాన్ని తన సొంతానికి వాడుకున్న సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. నగరానికి చెందిన ఓ బాధితుడిని సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఎర వేసి ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేయించి రూ.2.06కోట్లు కాజేశారు.
ఈ ట్రేడింగ్ ఫ్రాడ్‌కు సంబంధించి డిసెంబర్లో సైబర్ క్రైమ్ పిఎస్‌లో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన పోలీసు బృందం జనవరిలో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.47.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా కేసులో నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు నగదు, సొత్తు స్వాధీనం చేసుకున్నప్పుడు క్రిమినల్ కేసులైతే వాటిని బాధితుల ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలుచేయించి అప్పగిస్తారు. అదే సైబర్ క్రైమ్‌లో నిందితులతో పాటు సొమ్మును కోర్టుకు తరలిస్తారు.
ఆ నగదు భద్రపరిచే బాధ్యతలను కోర్టు పోలీసులకే అప్పగిస్తుంది.తక్కువ మొ త్తమైతే దర్యాప్తు అధికారులు తమ వద్దే ఉంచుకుంటారు. భారీగా ఉంటే బ్యాంక్‌లో డిపాజిట్ చేసి రసీదును కోర్టుకు అప్పగిస్తారు. కేసు విచారణ తర్వాత కోర్టు ఎవరికి ఆ నగదు అప్పగించమంటే వారికి ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం మరోలా జరిగింది. ఈ ట్రేడింగ్ ఫ్రాడ్‌లో స్వాధీనం చేసుకున్న సొమ్ము నుంచి రూ.20లక్షలను సదరు మహిళా ఇన్స్పెక్టర్ తన సొంతానికి వాడారు.
ప్రెస్‌మీట్ పెట్టి నిందితులను చూపించే సమయానికి తిరిగి కట్టవచ్చనుకున్నారు కానీ హఠాత్తుగా ప్రెస్‌మీట్ పెట్టడంతో డబ్బులు అడ్జస్ట్ కాక ఉన్న సొమ్ముతోనే ఫిబ్రవరిలో ప్రెస్‌మీట్ కానిచ్చేశారు. తీరా విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆమెపై మొదట బదిలీ వేటు వేశారు. తర్వాత సొమ్ము అడ్జస్ట్ చేసినప్పటికీ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సిపి సివి ఆనంద్ ఆ ఇన్స్పెక్టర్ వ్యవహారశైలిపై అంతర్గత విచారణకు ఆదేశించారు.
విచారణ అనంతరం ఆమెను మార్చ్‌లోనే సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా పోలీస్ వర్గాలు గప్‌చుప్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.సైబర్ క్రైమ్‌లో పోయిన సొమ్ము ను రికవరీ చేయడమే కష్టం కాగా రికవరీ అయిన సొత్తును కూడా పోలీసులు సొంతానికి వాడుకున్నారంటే తమ శాఖ పరువు పోతుందనుకుంటున్నారో ఏమో ఆ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు.