సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ): మేము చెప్పే సలహాలు, సూచనలు నచ్చితేనే మీరు ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయండి..అంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.82.57 లక్షల టోకరా వేశారు. మేడిపల్లికి చెందిన ఓ వ్యాపారి.. మార్చి 28న ఆన్లైన్లో ఆషిక ట్రేడింగ్ కంపెనీ ప్రకటన కన్పించగా.. క్లిక్ చేశాడు. మాపై నమ్మకం ఉంటే.. మేం ఏ స్టాక్ ఎలా పెరుగుతుందనే విషయాన్ని విశ్లేషణ చేసి.. ఏ షేర్ విలువ తగ్గుతుంది… ఏది పెరుతుందనే విషయాలను ఖచ్చితంగా చెబుతాం.. మీరు పిక్అప్ చేసిన షేర్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే.. మీరు తీసుకోవాలా వద్దా అనే విషయం చెబుతామంటూ ఫోన్లో బాధితుడితో కంగన శర్మ అనే పేరుతో మహిళ మాట్లాడింది.
ఆ తరువాత జే-4 ఆషిక స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో బాధితుడి నంబర్‌ను యాడ్చేసి అందులో మరిన్ని విషయాలు చర్చించారు. మీరు మాపై నమ్మకం ఉంచండి.. మేం చెప్పినట్లు చేయండి.. మాపై భరోసా వస్తేనే డబ్బులు పెట్టండి.. లేదంటూ ఇంకా కొన్నాళ్లు షేర్‌మార్కెట్‌పై అవగాహన తెచ్చుకోండంటూ సూచనలు చేశారు. వాళ్లు చెప్పే మాటలు నమ్మిన అతను.. ముందుగా రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాడు.
సైబర్‌నేరగాళ్లు సూచించిన యాప్ ద్వారా ట్రేడింగ్ చేయడంతో స్క్రీన్‌పై లాభాలు కన్పించాయి. దీంతో వారిపై నమ్మకం పెరగడంతో 19 లావాదేవీల్లో రూ. 82,57,515 పెట్టుబడి పెట్టాడు. స్క్రీన్‌పై భారీగా లాభాలు కన్పిస్తున్నాయి. అయితే విత్‌డ్రా చేసుకోవాలంటే కమీషన్ చెల్లించాలంటూ షరత్ విధించడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.