Rain Alert | హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. వానలకు వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు సైతం ఇక్కట్లకు గురవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు.
భారీ వర్షాల దృష్ట్యా సైబరాబాద్‌లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు. గురువారం సాధ్యమైనంత వరకు వర్క్‌ఫ్రం హోం చేయాలని.. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సహకారం అందించాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జాయింట్ ట్రాఫిక్ సీపీ కోరారు. హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనాల కదలికలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండగా.. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. దాంతో ఆయా ప్రాంతాలపై దృష్టి సారించిన పోలీసులు ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలీసులకు కంపెనీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.