Hyderabad | సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): ఒక పక్క ప్రపంచ అందాల పోటీలు.. మరో పక్క భారత్-పాక్‌ల మధ్య యుద్ధవాతావరణం.. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్‌తో పాటు ఇతర పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల వద్ద నిఘా పెంచారు.
నగరంలో ఉగ్రమూకలు, వాటి సానుభూతి మూలాలేమైన ఉన్నాయా అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కమిషనరేట్ పరిధిలోని సీసీ కెమెరాలన్నింటినీ 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, తప్పుడు వార్తలు రాకుండా ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతి రోజూ స్వదేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడంతో ఎయిర్‌పోర్ట్‌తో పాటు దాని పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీసు బలగాలతో పాటు నిఘా సంస్థలు, ఇంటెలిజెంట్ విభాగం, స్పెషల్ బ్రాంచ్, బాంబు స్కాడ్, క్లూస్ టీమ్స్, డాగ్ స్కాడ్, తదితర అన్ని విభాగాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. విపత్కర పరిస్థితులు ఎదురైతే అవలంభించాల్సిన చర్యలపై వ్యూహరచన చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు కమిషనరేట్ సరిహద్దు ప్రాంతాలు, సున్నిత, ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అందాల పోటీల నేపథ్యంలో..
అందాల పోటీల నేపథ్యంలో వివిధ దేశాల నుంచి వచ్చిన అందాల భామలు బస చేసే హోటళ్లు, వారు పర్యటించే ప్రాంతాలు, ప్రయాణించే మార్గాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పోటీలు జరిగే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఐటీ కారిడార్ వద్ద..
వందల సంఖ్యలో ఐటీ కంపెనీలు ఉన్న గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ తదితర ఐటీ కారిడార్‌పై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కారిడర్ మొత్తాన్ని భద్రతా పరంగా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎలాంటి విపత్తులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా భద్రతా బలగాలు అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం.