సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు విస్తరిస్తున్న మహానగర నిర్మాణంలో నిర్మాణ రంగ కార్మికుల పాత్ర కీలకమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పరిధిలోని మరీనా స్కైస్లో క్రెడాయి, న్యాక్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ‘నిర్మాణ రంగ కార్మికుల భద్రత’ అవగాహన కార్యక్రమాన్ని ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల, జాయింట్ సెక్రటరీ శ్రవన్ గోనె, క్రెడాయి ప్రెసిడెంట్ రామకృష్ణారావులతో కలిసి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… కమిషనరేట్ పరిధిలో సుమారు 10లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో వివిధ రాష్ర్టాల నుంచి వలస వచ్చినవారేనన్నారు.ఎస్సీఎస్సీ, సైబరాబాద్ పోలీసులు కలిసి క్రెడాయి సహకారంతో కమిషనరేట్ పరిధిలోని అన్ని కార్మిక బస్తీలు, కాలనీల్లో వైద్యశిబిరాలు నిర్వహించడం, ఎలక్ట్రికల్ పనులు, ఎత్తైన భవనాలపై పనులు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల మాట్లాడుతూ రానున్న 3నెలల్లో సుమారు లక్షమంది కార్మికులకు భద్రత అంశాలపై శిక్షణ కల్పించనున్నామన్నారు. దేశంలో వ్యవసాయం తరువాత 2వ అతిపెద్ద సంస్థ నిర్మాణ రంగ పరిశ్రమ అని, ఈ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 51మిలియన్ల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోందని ఎస్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ శ్రవణ్ గోనె పేర్కొన్నారు. నిర్మాణ రంగం ద్వారా దేశ జీడీపీకి 9శాతం భాగస్వామ్యం ఉందన్నారు.
ప్రతి సైట్లో ఈ శిక్షణ కోసం 2గంటల సమయాన్ని కేటాయించాలని క్రెడాయి ప్రెసిడెంట్ రామకృష్ణారావు సభ్యులను కోరారు. అనంతరం తొలిరోజు రెయిన్బో విస్టా వద్ద గల మరినా స్కైస్ సైట్లో దాదాపు 800మంది కార్మికులకు శిక్షణ కల్పించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ టి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.