సైబరాబాద్‌లో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు పెరగడంతో పాటు రెట్టింపు చలాన్లు ప్రజలపై వేశారు. ట్రాఫిక్ చలాన్లే లక్ష్యంగా ఈ ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం పని చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. చలాన్లపైనే దృష్టి పెట్టారంటూ సామాన్యులు ఎంత మొర పెట్టుకున్న పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జరిమానాలు సుమారు 115 శాతం అధికంగా ఉండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. దోపిడీలు పెరిగాయి, మహిళలపై అఘాయిత్యాలు, ఆర్థిక నేరాలు పెరిగాయి. ఈ ఏడాది 31,569 ఫిర్యాదులు రాగా గతేడాది 30,883 ఫిర్యాదులు ఆయా ఠాణాలకు వచ్చాయి. ఈ ఏడాది ఐపీసీకి సంబంధించి 22 శాతం కేసులు నమోదు కాగా గతేడాది ఇది 17 శాతంగా ఉంది.
సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి 2025 వార్షిక నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో సైబర్ నేరాలు తగ్గాయని, గతేడాదితో పోలిస్తే 35 నుంచి 40 శాతం వరకు ఈ తగ్గుదల ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు పెరిగిన మరణాలు తగ్గాయని వెల్లడించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై నాన్ కాంటాక్టు పద్ధతిలో ఎక్కువగా చలాన్లు వేస్తున్నట్లు వివరించారు.
వీసా గడువు పూర్తయినా నిబంధనలకు విరుద్దంగా నివాసముంటున్న విదేశీయులను గతేడాది 27 మందిని డిపోర్టు చేయగా, ఈ ఏడాది 72 మందిని డిపోర్టు చేసినట్లు సీపీ తెలిపారు. షీ టీమ్స్ ఈ ఏడాది 1043 పిటిషన్లు రాగా అందులో 83 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు, మిగతా వాటిలో 2,964 పిటీ కేసులు నమోదు చేగా 3,322 మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వివరించారు. గతేడాది 421 కేసుల్లో 954 మందిని అరెస్ట్ చేసి రూ. 24.20 కోట్ల విలువైన వివిధ రకాల డ్రగ్స్‌ను సీజ్ చేయగా ఈ ఏడాది 575 కేసులు నమోదు చేసి, 1228 మందిని అరెస్ట్ చేసి, రూ. 16.85 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.
గందరగోళంగా నివేదిక..
సైబర్‌నేరాలు తగ్గుముఖం పట్టడంతో నివేదికలో వివరంగా అందించారు. అయితే ఇందులో మహిళలు, పిల్లలపై జరిగిన దాడులకు సంబంధించిన విషయాలపై స్పష్టత ఇవ్వలేదు, తగ్గిన నేరాలకు సంబంధించి సవివరంగా వివరిస్తూ పెరిగిన నేరాలను ఎక్కువగా ప్రస్తావించలేదు. 2025 వార్షిక నివేదిక అంతా సైబర్‌క్రైమ్‌ను ఫోకస్ చేయడంపైనే సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. సైబర్‌నేరాల్లో గతేడాది సుమారు రూ. 793 కోట్లు నష్టపోగా, ఈ ఏడాది రూ. 404 కోట్లు నష్టపోయినట్లు నివేదికలో వెల్లడించారు, ప్రధానంగా డిజిటల్ అరెస్ట్‌లు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గజారావు భూపాల్, డీసీపీలు రితిరాజ్, సురేశ్‌కుమార్, యోగేశ్ గౌతమ్, రాజేశ్, ముత్యంరెడ్డి, సుదీంద్ర, స్రుజన కర్ణం, శోభన్‌కుమార్, సంజీవ్, సాయి మనోహర్, రంజన్ రతన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా జరిమానాలు..
ప్రజలపై చలాన్లు వేసి ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టే విధంగా ట్రాఫిక్ విభాగం పనిచేస్తుందని నివేదికలో లెక్కలు చూసి అందరు చర్చించుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడానికి బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగిన చర్యలు తీసుకున్నామని కమిషనర్ చెప్పారు. అయితే జరిమానాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
