Hyderabad | సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్‌లు, వాటితో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పతున్న 18 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 687 ఫేక్ రబ్బర్ స్టాంప్‌లు, 1180 ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు వేరువేరు ఘటనలలో అరస్టైయిన వారి వివరాలను మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
బ్యాంకర్లపై అనుమానం
మేడ్చల్ జిల్లా సురారం ప్రాంతానికి చెందిన గంట రంగారావు నకిలీ స్టాంప్‌లు, డాక్యుమెంట్లు తయారు చేయడంలో ప్రధాన సూత్రధారి. ఇతడిపై 2005లో జీడిమెట్ల, 2012లో మీర్పేట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రబ్బర్ స్టాంపులు తయారు చేసే కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన శివన్నగారి మానిక్‌ప్రభు ఇతడికి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి నకిలీ రబ్బర్ స్టాంప్‌లు అవసరాన్ని బట్టి తయారు చేసి ఇస్తుంటాడు. కూకట్‌పల్లికి చెందిన పంచకర్ల నాగ మల్లేశ్వరరావు ఏజెంట్, కొత్తపల్లి సుధాకర్ రావు లోన్ కన్సల్టెంట్, సురారం ప్రాంతానికి చెందిన కాగిత సీతారామరావు జిరాక్స్ షాప్ నిర్వహిస్తూ నకిలీ డాక్యుమెంట్ల ఎలా కావాలంటే అలా ప్రింట్లు ఇస్తుంటాడు. జీడిమెట్లకు చెందిన కొండేటి చంద్రశేఖర్‌రావు బిల్డింగ్, ప్లాట్లకు సంబంధించిన లేఔట్ ట్యాంపరింగ్ చేసి నకిలీవి సృష్టిస్తుంటాడు.
ఈ ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. రుణం కావాల్సిన వాళ్లు లోన్ ఏజెంట్లు, కన్సల్టెంట్స్ను సంప్రదిస్తుంటారు. రుణం కోసం వచ్చే కస్టమర్లు తెచ్చే డాక్యుమెంట్లలో లోపాలు చూపించి రుణాలు రావడం కష్టమని సూచనలు చేసి, రంగారావు ముఠాతో ఫేక్ స్టాంప్‌లు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ లేఔట్ ప్లాన్లు చేపిస్తారు. ఇక్కడ ఒక్కొక్కరు రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు ఫీజులు తీసుకుంటారు. తయారు చేసిన నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతారు. వచ్చిన రుణంలో 3 నుంచి 4 శాతం కమిషన్ తీసుకుంటుంటారు.
ఒక్కొక్క కస్టమర్‌కు రూ.10 లక్షలకుపైగా రుణాలు ఇప్పిస్తుంటారు. ఈ కేసులో ఇతర ఏజెంట్లు, బ్యాంకర్లు, ప్యానల్ అడ్వకేట్లు, వాల్యువేటర్స్ పాత్రపై కూడా విచారించాల్సి ఉందని సీపీ తెలిపారు. బాలానగర్ జోన్ ఎస్ఓటీ, కేపీహెచ్‌బీ పోలీసులు సంయుక్తంగా విశ్వసనీయ సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 660 నకిలీ రబ్బర్ స్టాంప్‌లు, 645 ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రబ్బర్ స్టాంప్‌లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ తదితర విభాగాలకు సంబంధించిన శాఖలవి ఉన్నాయని సీపీ వివరించారు.
లోపాలు చూపి.. కమీషన్లు దండుకొనే కన్సల్టెన్సీలు
కూకట్‌పల్లిలో వాక నాగిరెడ్డి ఏబీఎల్ లోన్స్, దొంతుల మణికంఠ డీఎంకే అసోసియేట్స్, జగద్గిరిగుట్టలో కరిమి శణ్ముఖరావు నిధి అసోసియేట్స్, కొల్లి రామరాజు ఆర్ఆర్ ఆసోసియేట్స్ పేరుతో లోన్ కన్సల్టెన్సీలను నిర్వహిస్తున్నారు. ఈ కన్సల్టెన్సీలలో రేవురి దొరబాబు, బోట్స మహేశ్, లక్ష్మణ్ రాకేశ్ కుమార్, మెంటల చంటి, పురిమెట్ల నవీన్‌కుమార్, దాసపల్లి వీరబాబు, గొల్లముడి రామ్ తివారి, కొల్లి శంకర్రావు ఏజెంట్లు, ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. బిజినెస్ లోన్స్ కోసం వచ్చే వారు కొందరు నేరుగా బ్యాంకులకు వెళ్తే ఆయా వ్యాపారాలలో ఉండే లోపాలతో తిరస్కరణకు గురవుతాయి, రుణం పొందాలంటే తప్పని సరిగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి.
అయితే ఎలాంటి లోపాలు లేకుండా రుణాలు తీసుకోవడానికి వ్యాపారులు లోన్ కన్సల్టెన్సీలను సంప్రదిస్తుంటారు. ఇలాంటి వారు రుణాలకు సంబంధించిన దరఖాస్తులలో లోపాలను గుర్తించి, వారికి ఆయా ప్రభుత్వ విభాగాలకు సంబంధించి నకిలీ స్టాంప్‌లు ఉపయోగించి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. ఇందుకు ప్రాసెసింగ్ ఫీ కింద మొదట రూ.10 వేలు వసూలు చేస్తారు. అనంతరం కావాల్సిన డాక్యుమెంట్లు నకిలీవి తయారు చేసి లోన్ ప్రాసెసింగ్ చేస్తారు. ఇందుకు కార్మిక శాఖతో పాటు తదితర ప్రభుత్వ విభాగాల నకిలీ రబ్బర్ స్టాంప్‌లు, నకిలీ డాక్యుమెంట్లు కన్సల్టెన్సీలు ఉపయోగిస్తుంటారు. కన్సల్టెన్సీల నిర్వాహకులతో పాటు ఏజెంట్లు, ఉద్యోగులు 12 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 27 ఫేక్ స్టాంప్‌లు, 535 ఫేక్ సర్టిఫికెట్లు తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. రుణాలు ఇవ్వడంలో ఏజెంట్లు, బ్యాంకు సిబ్బంది, అధికారులు, ప్యానల్ అడ్వకేట్లు, వాల్యూయేటర్స్ పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని సీపీ వెల్లడించారు.