సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన సెల్ఫోన్ల రికవరీపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 6 దఫాలుగా పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు తాజాగా 30 రోజుల్లోనే రూ.95 లక్షల విలువ చేసే మరో 310సెల్ఫోన్లను రికవరీ చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ ఎల్.సి.నాయక్ మాట్లాడుతూ సెల్ఫోన్లను రికవరీ చేయడంలో సైబరాబాద్ పోలీసు బృందాలు కృషి చేస్తున్నాయన్నారు. 310ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటీటీ రిజిస్టర్ (సీఈఐఆర్)పోర్టల్ ద్వారా గుర్తించి, రికవరీ చేయడంతో పాటు వాటిని సంబంధిత యజమానులకు అందజేశామని తెలిపారు.
సీసీఎస్ మాదాపూర్ పోలీసులు 80ఫోన్లను, సీసీఎస్ బాలానగర్ పోలీసులు 65ఫోన్లు, సీసీఎస్ మేడ్చల్ పోలీసులు 55ఫోన్లు, సీసీఎస్ రాజేంద్రనగర్ పోలీసులు 55ఫోన్లు, సీసీఎస్ శంషాబాద్ పోలీసులు 55ఫోన్లను రికవరీ చేసినట్లు వివరించారు. సెల్ఫోన్లు చోరీకి గురైనప్పుడు సీఈఐఆర్ పోర్టల్లో, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. రికవరీ చేసిన సెల్ఫోన్లను తన చేతుల మీదుగా సంబంధిత సెల్ఫోన్ యజమానులకు అందచేశారు. సీసీఎస్ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, మాదాపూర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంజీవ్, శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజు, మేడ్చల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ దాలినాయుడు, సోషల్ మీడియా ఎస్ఐ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.