News Year Restrictions | న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో భాగ్యనగరం వాసులు 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2024 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ మేరకు హైదరాబాదీలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకలపై సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కీలక సూచనలు చేశారు. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఇతరులకు ఇబ్బందులకు కలుగకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ఫ్లై ఓవర్లు, ఓఆర్ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్‌పై రాకపోకలకు అనుమతి లేదని తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. రాత్రి 8 నుంచి పోలీసుల డ్రంక్ అండ్ వ్రైవ్ తనిఖీలుంటాయన్నారు. స్టంట్స్, ఓవర్ స్పీడ్ వెళ్లిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వేడుకల కోసం అనుమతులు కోరిన వారికి సూచనలు చేసినట్లు చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్ వాహనాల కోసం ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ విషయంలో పబ్‌ల యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.