Sahasra Murder | హైదరాబాద్ : క్రికెట్ బ్యాట్‌ను దొంగిలించేందుకు వచ్చి సహస్రను చంపేసినట్లు పదో తరగతి బాలుడు అంగీకరించినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సహస్ర హత్య కేసు విషయాలను ఇవాళ సైబరాబాద్ సీపీ మీడియాకు వెల్లడించారు.
సహస్ర తమ్ముడి బ్యాట్ బాగుందని, దాన్ని ఎలాగైనా దొంగిలించాని పదో తరగతి బాలుడు ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఓ ప్రణాళిక ప్రకారం.. ఈ నెల 18న సహస్ర పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో లోపలికి ప్రవేశించాడు. ఆ సమయంలో సహస్ర టీవీ చూస్తోంది. ఇక కిచెన్‌లో ఉన్న బ్యాట్‌ను తీసుకెళ్లేందుకు టెన్త్ విద్యార్థి మెల్లిగా అక్కడికి వెళ్లాడు. కానీ బ్యాట్ తీసుకెళ్తున్నట్లు శబ్దం రావడంతో.. అతన్ని సహస్ర గమనించి గట్టిగా కేకలు వేసింది. అతని చొక్కా పట్టుకుని నిలదీయగా.. వెంటనే బాలికను బెడ్రూమ్లోకి తోసేసి కత్తితో పొడిచి చంపాడు. ఇక ఏమీ తెలియనట్లు ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. దొంగచాటుగా తన ఇంటికి వెళ్లాడు. అక్కడ తండ్రి, సోదరీమణుల కంటపడకుండా మెల్లిగా బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేసినట్టు నటించి రక్తపు మరకలతో కూడిన బట్టలను వాషింగ్ మెషీన్లో వేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక సహస్రను హత్య చేసిన రోజే అతని తల్లికి అనుమానం వచ్చింది. అదే రోజు అడిగితే తనకేమీ తెలియదని చెప్పాడు. రెండో రోజు, మూడో రోజు కూడా అడిగితే.. నువ్వే నన్ను పట్టించేటట్టు ఉన్నావని నిందితుడు తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. హత్య చేసిన తర్వాత కత్తి బయటపడేసి, టీషర్ట్ కప్పుకుని లోపలికి వెళ్లాడని, అనంతరం బాత్రూమ్లో స్నానం చేసి ఆ బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసినట్లు వివరించారు. అయితే రెండు నెలల క్రితం నిందితుడి వద్ద ఓ మొబైల్ కనిపించిందని, ఎక్కడిది అని తల్లి అడిగితే సమాధానం చెప్పలేదని ఆమె పోలీసులకు తెలిపినట్లు పేర్కొన్నారు.
నిందితుడు సరిగ్గా పాఠశాలకు వెళ్లేవాడు కాదని, ఇంట్లోనే ఉంటూ నిత్యం ఓటీటీ క్రైమ్ సినిమాలు చూసేవాడని పేర్కొన్నారు. ఇక ఈ నెల 18వ తేదీన ఉదయం 11.30 గంటలకు కుందేల్ కూడా చనిపోయిందని, ఆ స్టోరీ కూడా నిందితుడు వివరించాడన్నారు. సహస్ర ఇంటికి నిందితుడు పలుమార్లు వెళ్లాడని, డోర్ లాక్ చేయరన్న విషయం తెలిసే ఆ రోజు దొంగతనానికి వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది.