బంజారాహిల్స్, మార్చి 26: తిరుమలలో గదుల కోసం ఆన్లైన్లో వెతికిన వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. కమలాపురికాలనీలో నివాసం ఉంటున్న చిరుమామిళ్ల ప్రసాద రావు అనే వ్యాపారి ఇటీవల తిరుమల వెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో తిరుమలలో గదులు బుకింగ్ చేసుకునే ఉద్దేశంతో గూగుల్లో సెర్చ్ చేస్తున్న క్రమంలో ఓ లింక్ ఓపెన్ అయింది. దానిలో సూచించిన ప్రకారం గది బుక్ చేసుకునే క్రమంలో అమన్ పరాస్ అనే పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ప్రసాదరావు అకౌంట్ నుంచి గూగుల్ పే ద్వారా రూ.10వేలు కాజేశారు. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 318(4), 319(2)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.