సిటీబ్యూరో, నవంబర్ 15(నమస్తే తెలంగాణ) : సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కే సైబర్‌నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ రూపొందించి సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో శనివారం వివరాలు పోస్ట్ చేశారు. తన పేరుతో ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారు. తన స్నేహితులకు తాను ఆపదలో ఉన్నానని, డబ్బులు పంపించమని అడిగినట్లు మెసేజ్‌లు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈ విషయం నిజమే అనుకుని తన స్నేహితుడు వాళ్లు పంపిన ఖాతాకు రూ. 20వేలు పంపించారని తన పేరుతో ఉన్న పేజ్ లింక్ ఇస్తూ ఇతర పేజిలేవీ తనవి కావని, అవన్నీ నకిలీవని తెలిపారు.
ఈ ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ బృందం తొలగించే పనిలో ఉంది. తన పేరుతో కానీ, ఇంకా ఏ అధికారి లేదా ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్బుక్లో వచ్చే అభ్యర్థనలకు స్పందించవద్దని సజ్జనార్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా అలా మెసేజ్‌లు చేస్తే ముందుగా ఫోన్‌ద్వారా ఆ వ్యక్తిని సంప్రదించి పరిశీలించాలని, అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియోకాల్‌లు ఉంటే వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్‌క్రైమ్ వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలని సజ్జనార్ కోరారు.