సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీపై కేసు నమోదయ్యింది.. ఈ కేసు విషయం సుప్రీంకోర్టు జడ్జి ముందు హాజరుకావాల్సి ఉంటుంది.. తెల్ల బట్టలు ధరించి వీడియో కాల్లోకి మీరు హాజరుకావాలంటూ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్‌చీటర్స్ అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 56 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. తట్టిఅన్నారంలోని ఓ విల్లాలో నివాసముండే బాధితుడు రిటైర్డు ఉద్యోగి. ఆయనకు ట్రాయ్(టెలికాం డిపార్టుమెంట్) నుంచి మాట్లాడుతున్నామంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ మొబైల్ నంబర్ రెండు గంటల్లో డిస్కనెక్ట్ అవుతుందని, వివరాలు తెలుసుకోవడానికి 9 నొక్కండి అంటూ వాయిస్ మెసేజ్ వచ్చింది.
బాధితుడు అందులో చెప్పినట్లు చేయడంతో తాము బెంగుళూర్ పోలీసులమని, మీ ఫోన్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఉపయోగించారని.. కేసు రిజిస్టర్ అయ్యిందంటూ చెప్పారు. మీ ఆధార్ కార్డును ఉపయోగించి నేరాలకు పాల్పడ్డారని, సదాకత్ ఖాన్ అనే వ్యక్తి కంబోడియా, మయన్మార్, ఫిలిప్పిన్స్‌కు సైబర్ నేరాలు చేసేందుకు హ్యూమన్ ట్రాఫిక్ చేస్తూ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడని చెప్పారు. అందులో మీ ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ వివరాలు వచ్చాయని.. అందుకే మిమ్మల్ని కూడా ఈ కేసులో అనుమాని స్తున్నామని చెప్పారు.
ఆ తరువాత తన పేరు కళ్యాణ్ చక్రవర్తి అని సీబీఐ ఆఫీసర్‌నంటూ, మరో వ్యక్తి సైతం మాట్లాడి ఈ విషయం ఎవరికి మీరు చెప్పకండి.. మీకు బెయిల్ మంజూరు చేస్తు న్నాం.. వాట్సాప్‌లో పేపర్స్ పంపిస్తున్నాం వివరాలు పంపించండి.. ఈ విషయం రహస్యంగా ఉంచాలంటూ సూచించారు. ఈ మేరకు బెయిల్ పేపరంటూ కొన్ని పేపర్లు పంపించి వివరాలు తీసుకున్నారు. మీరు సీనియర్ సిటిజన్ కావడంతో నేరుగా సుప్రీంకోర్టు జడ్జి ముందు హాజరు పరుస్తామని, ఈ కేసు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తోందని, జడ్జి ముందు హాజరుకావడానికి మీరు తప్పని సరిగా తెల్ల బట్టలు వేసుకొని ఉండాలని, జడ్జి సీట్లోకి వచ్చినప్పుడు లేచి నిల్చొని ఆయన కూర్చున్న తరువాతే మీరు కూర్చోవాలంటూ సూచించారు.
మీకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చాలంటే మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయాల్సి ఉంటుందని, అందులో ఉన్న నగదు మేం సూచించిన ఖాతాలోకి బదిలీ చేసి, మీకు ఏమి సంబంధం లేదని తేలితే ఆ డబ్బంతా తిరిగి మీకు పంపించేస్తామంటూ చెప్పారు. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తోందంటూ భయపెట్టించి, అతని ఖాతాలలో ఉన్న రూ. 56 లక్షలు కాజేశారు. ఈ విషయం తనకు తెలిసిన వారితో బాధితుడు చర్చించగా ఇదంతా మోసమని చెప్పగా.. అతను రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోచారం, నవంబర్ 12: సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ ఘటనలు పోచారం పోలీస్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నాయి. ఇన్స్పెక్టర్ రాజు వర్మ వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్‌లోని నవదుర్గ కాలనీలో నివాసం ఉండే మాలోత్ రవి(28)కి గుర్తు తెలియని వ్యక్తి (సైబర్‌నేరగాడు) ఫోన్ చేయగా మాట్లాడాడు. పెద్ద పెద్ద హోటళ్లకు రేటింగ్ ఇవ్వాలని, ఇందులో మీకు 10 శాతం కమీషన్ ఇస్తామని నమ్మించారు. అతని నుంచి ఓటీపీ తెలుసుకుని రూ.1లక్షా 9వేల రూపాయలను కాజేశారు. అలాగే.. మరో ఘటనలో పోచారంలోని సాయి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే సత్యానంద్‌కు సైబర్ నేరగాడు ఫోన్ చేసి యాక్సెస్ బ్యాంక్ నుంచి బీమా యాక్టివేట్ చేయాలంటూ నమ్మించి.. అతని ఖాతా నుంచి రూ.1,34,389 రూపాయలను కాజేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.