వెంగళరావునగర్, అక్టోబర్ 30 : నేషనల్ హెల్త్‌కేర్ ఇండియా ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తామని నమ్మించి క్రెడిట్ కార్డు నుంచి నగదు కాజేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై జమాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బీకే గూడలోని దాసారాం బస్తీలో నివాసం ఉండే సర్ధార్ ప్రభుజిత్ సింగ్ ప్రైవేటు ఉద్యోగి. గుర్తు తెలియని వ్యక్తులు అతడి సెల్‌కు ఫోన్‌చేసి నేషనల్ హెల్త్‌కేర్ ఇండియా నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు.
మీ నాన్న హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు వాడుతున్నాడని, క్రెడిట్ పాయింట్స్ ఎక్కవగా ఉన్నందున హెల్త్‌కేర్ ఇండియా ఇన్సూరెన్స్‌లో ఉచితంగా పాలసీ ఇస్తామని నమ్మించారు. వెంటనే అతడి సెల్ ఫోన్‌కు ఒక వెబ్సైట్ లింకును పంపించారు.
క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఓటీపీ నంబర్ సైతం ఎంటర్ చేయడంతో అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.87,992 డబ్బులను కాజేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.