సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): ‘ఉగ్రవాద కార్యకలాపాలతో మీకు ఏమైనా సంబంధం ఉందా.. వారికి సంబంధించి జరిగిన మనీలాండరింగ్‌లో మీ ఖాతాల నుంచి డబ్బులు ఎందుకు వెళ్లాయి. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫొటోల్లో మీ ఫొటో ఎందుకు ఉంది.. మీ పేరు కేసులో చేరుస్తున్నామం’టూ సైబర్ నేరగాళ్ల బెదిరించి..ఓ రిటైర్డ్ డాక్టర్‌ను బురిడీ కొట్టించారు. ఏకంగా రూ. 2.2 కోట్లు కొల్లగొట్టారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన రిటైర్డ్ డాక్టర్‌ను ఉగ్రవాద లింకు పేరుతో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేశారు.
ఓ వ్యక్తి తన పేరు ప్రేమ్‌కుమార్ ఐపీఎస్ ఆఫీసర్‌నంటూ పరిచయం చేసుకున్నాడు. ఉగ్రవాద కేసులో మీ పేరు చేరుస్తున్నామంటూ మాట్లాడాడు. కొద్దిసేపటికే ఓ వాట్సాప్ వీడియో కాల్ లో తాను ఎన్ఐఏ అధికారి సదానంద్నంటూ పరిచయం చేసుకుని తాము కొందరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో ఏటీఎం కార్డులకు సంబంధించిన లావాదేవీలు పరిశీలిస్తే కొన్ని డాక్టర్ బ్యాంక్ అకౌంట్స్‌తో లింక్ అయి ఉన్నాయని, వాటి ద్వారా జరిగిన మనీలాండరింగ్‌తో ఉగ్రవాదులకు అందాయని బెదిరించారు. ఇది ఉగ్రవాద సంబంధిత కేసు కాబట్టి ఎవరికీ చెప్పవద్దని, ఇది పూర్తి రహస్యంగా ఉంచాలని చెప్పారు.
కొంచెం సేపు బెదిరించి ఆ తర్వాత మనీలాండరింగ్ జరగలేదని నిరూపించాలంటే మొదట ఆమె అకౌంట్ నుంచి తాము చెప్పిన అకౌంట్లకు డబ్బులు పంపాలని సూచించారు. ఆమెకు మరింత నమ్మకం కలిగించడానికి ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు జడ్జి పేరుతో ఓ లేఖను సృష్టించి ఆమెకు పంపారు. ఇంత జరిగిన తర్వాత తనను కేసులో ఇరికిస్తారన్న భయంతో బాధితురాలు తన దగ్గర బ్యాంక్‌లో ఉన్న డబ్బులు, ఫిక్స్డ్ డిపాజిట్లు విత్ డ్రా చేయడంతో పాటు తెలిసిన వారి దగ్గర నుంచి కొంత తీసుకుని మొత్తం రూ.2.2 కోట్లను వారు సూచించిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత డబ్బులు రిఫండ్ కాకపోవడంతో ఆ ఫోన్ నంబర్లకు సంప్రదిస్తే అవి పని చేయడం లేదు. దీంతో తాను మోసపోయినట్లుగా గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.