సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఆర్మీలో భారీ ఎత్తున ఎక్స్ రే యంత్రాలు కావాలంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ వ్యాపారిని మోసం చేసి రూ.25 లక్షలు టోకరా వేశారు. ఎక్స్ రే స్కానింగ్ యంత్రాల వ్యాపారం చేసే ఇవల్యూజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన వ్యాపార ప్రమోషన్లో భాగంగా గూగుల్‌లో వ్యాపారానికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి.. తాము ఆర్మీలో పనిచేస్తున్నామంటూ పరిచయం చేసుకొని.. తమకు భారీ ఎత్తున యంత్రాలు అవసరం ఉన్నాయని నమ్మించారు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని వివరాలు మాట్లాడిన తర్వాత, మా బ్యాంకు ఖాతా నంబర్‌ను మీ నెట్ బ్యాంకింగ్‌లో బెనిఫిషియరీ లిస్ట్‌లో చేర్చుకోవాలని సూచించారు. నిర్వాహకులు అలాగే చేశారు.
ఆ తర్వాత ఆర్మీ రూల్స్ ప్రకారం రూ. 5 పంపిస్తే, మీకు తిరిగి రూ.10 వస్తాయని, ముందుగా నమ్మకం కోసం రూ.5 పంపించండి.. అంటూ సూచించారు. తొలుత ఐదు రూపాయలు పంపడంతో తిరిగి రూ.10 వచ్చాయి. ఇప్పుడు మీకు నమ్మకం కుదిరిందా.. మీరు పంపించిన డబ్బుకు డబుల్ వస్తుందని చెప్పారు. మాకు రూ. 24,99,995 పంపించండి.. అంటూ సూచించారు. దీంతో మాకు వస్తువులు వస్తాయి.. మీకు డబ్బు కూడా డబుల్ వస్తుంది.. అంటూ ఆశ చూపారు. ఆ వ్యాపారి అలాగే డబ్బు పంపించాడు. ఆ తర్వాత నేరగాళ్లు సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిపెట్టారు. ఇదంతా మోసమని గ్రహించిన వ్యాపారి గురువారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో..
అంబర్‌పేటకు చెందిన ఒక వ్యాపారికి పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌కు స్పందించిన వ్యాపారి.. ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో వాట్సాప్‌లోకి వెళ్లాడు. మేం చెప్పినట్లు మీరు చేస్తే భారీగా సంపాదించుకునే అవకాశం ఉన్నదని సూచించారు. అయితే, ముందుగా మేం చెప్పే విషయాలు వినేందుకు టెలిగ్రామ్ గ్రూప్‌లోకి రావాలని సూచించారు. వ్యాపారిని ఆ గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆ తర్వాత ఓ యాప్‌ను డౌన్లోడ్ చేయించి, రూ.100 పెట్టి, కొన్ని టాస్క్‌లు ఇచ్చి మీ అదృష్టాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. నిమిషాల వ్యవధిలోనే స్క్రీన్‌పై వందకు రూ. 150 వచ్చినట్లు కనిపించింది.
ఇక అక్కడి నుంచి ఆ వ్యాపారి తొలుత వేలు.. ఆ తర్వాత లక్షలు పెట్టుబడిగా పెడుతూ వెళ్లాడు. స్క్రీన్‌పై భారీ లాభాలు కనిపిస్తున్నాయి. కానీ, ఆ డబ్బు డ్రా చేసేందుకు అవకాశం లేదు. దీంతో వ్యాపారి వారితో మాట్లాడగా.. మీరు జీఎస్టీ, ఇతర పన్నులు చెల్లించి డబ్బు రిలీజ్ చేసుకోవచ్చు.. అని సూచించారు. మీరు వేగంగా టాస్క్ పూర్తి చేసుకోండి.. అంటూ చెప్పారు. వారి మాటలు నమ్మిన బాధితుడు దఫ దఫాలుగా రూ.36 లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. సైబర్ నేరగాళ్లు ఇంకా వ్యాపారి నుంచి డబ్బు లాగేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా గ్రహించిన వ్యాపారి గురువారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.