సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఇటీవల ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.87.50 లక్షలు కొట్టేసిన ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పలువురు పేర్లతో నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. వీటి ద్వారానే విదేశాల్లో ఉన్న సూత్రధారులు బాధితుల నుంచి నగదు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా రూ.8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ కు చెందిన ఓ రిటైర్డ్ ఎంప్లాయ్కు ఫేస్బుక్ ద్వారా ఫైనాన్షియల్ ట్రేడింగ్‌కు సంబంధించి ఒక రిక్వెస్ట్ వచ్చింది. మొదట 40 వేలు డిపాజిట్ చేస్తే లాభాలు రావడంతో 10 లక్షల రూపాయలు నేరగాళ్లు చెప్పిన వివిధ బ్యాంక్ ఖాతాలలో జమచేశాడు. ఆ తర్వాత నేరగాళ్లు రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఖాతాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు అవి నకిలీ పేర్లతో ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు.
వివిధ రకాల పేర్లతో అధికలాభాలు ఇస్తామంటూ నేరగాళ్లు ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఈ నేరాలతో దోచుకున్న సొమ్ము ను ట్రాన్స్ఫర్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలే కీలకంగా మారాయి. ఒకవైపు బాధితులు తమ డబ్బులను జమ చేసిన ఖాతాలు నకిలీ పేర్లతో ఉంటే మరోవైపు నేరగాళ్లు తాము చేసే నేరాలలో కాజేసిన సొమ్మును పలు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి, అవకాశం ఉన్నచోట విత్ డ్రా చేసుకుంటున్నారు. కొంతమంది బ్యాంక్ సిబ్బంది సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను నీళ్లకొదిలి నకిలీ పత్రాలతో బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు సహకరిస్తున్నారు. దీంతో ఆ అకౌంట్స్‌కు బాధితులు ట్రాన్స్ఫర్ చేసిన సొమ్ము రికవరీ చేయడం పోలీసులకు కష్టమవుతోంది.
తమ పని పూర్తి చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలతో కొత్త పన్నాగం వేసి డబ్బులు సులువుగా కొట్టేస్తున్నారు. బ్యాంక్ ఖాతాల్లో రెండు రకాల అకౌంట్స్ ఉండగా ఒకటి సేవింగ్స్, మరొకటి కరెంట్. ఈ కరెంట్ ఖాతాలపైనే నేరగాళ్లు దృష్టిపెడుతున్నారు. బ్యాంకులు పర్సనల్ వెరిఫికేషన్ లేకుండా కరెంట్ ఖాతాను తెరుస్తుండడంతో సైబర్ నేరగాళ్లకు అనుకూలమవుతోంది.
మరోవైపు కేవైసీ పూర్తయిన బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి ఖాతాలను గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా వెంటనే వాడుకునే అవకాశం ఉండడంతో సైబర్ నేరగాళ్లకు ఇవి వరంగా మారుతున్నాయి. ఇందులో ఎక్కువగా కొటక్ మహీంద్ర, యాక్సిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులున్నాయి. నేరగాళ్లు ఈ ఐదు బ్యాంకుల ద్వారా 62శాతం లావాదేవీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బ్యాంక్ ఖాతాలు తెరవడానికి అవసరమైన పర్సనల్ డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కుతోంది. ప్రజలకు చెందిన ఫోన్‌నెంబర్లు, సిమ్‌కార్డులు, బ్యాంక్ ఖాతాలు నేరగాళ్ల చేతికి పోవడంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. ఒడిశా, వెస్ట్‌బెంగాల్, ఈశాన్యరాష్ర్టాల నుంచి సిమ్ కార్డులు కొనుగోలు చేసి వాటి ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం సిబ్బందికి సైబర్ క్రైమ్‌లో శిక్షణ ఇవ్వాలని బ్యాంకులకు సూచిస్తున్నామని పోలీసులు తెలిపారు.