Cyber Crime | సిటీబ్యూరో, నవంబర్ 6 ( నమస్తే తెలంగాణ ) : అధిక లాభాలు వస్తాయంటూ ఆశజూపిన సైబర్ నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగి నుంచి 2.29 కోట్ల రూపాయలను కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఐటీ ఉద్యోగి ‘బీ2231కేఎస్ఎల్ అఫిషియల్ స్టాక్’ అనే వాట్సప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు. కాగా ఈ గ్రూప్‌ను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, స్కిల్ బిల్డింగ్ కోసం నారాయణ, అంజలి వారి సిబ్బంది నిర్వహిస్తున్నారు.
ఇందులో లాభదాయకమైన ట్రేడింగ్స్ ఉంటాయని నమ్మించేవారు. దీంతో ఐటీ ఉద్యోగి అది నమ్మి కొటక్ప్రో పేరుతో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ చేసుకున్నాడు. వారి సూచనలతో అందులోకి కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా మొత్తం 2.29 కోట్ల రూపాయలను స్టాక్‌ల కోసం డిపాజిట్ చేశాడు. అయితే చాలా రోజుల నుంచి ఈ ఎమౌంట్ వర్చువల్‌గా అందులో కనిపిస్తుంది.
కానీ ఆ సొమ్మును విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే అప్పటికే ఆ డబ్బును సైబర్ మోసగాళ్లు కాజేశారు. అంతేకాదు మరింత డబ్బు కోసం అతడిని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానిని గ్రహించిన సదరు ఐటీ ఉద్యోగి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ పి. మధు కేసు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులు నరేశ్ షిండే, సౌరబ్ షిండేను అరెస్ట్ చేసి రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.