సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలొస్తున్నాయని ఒకరు…. క్రిప్టో కరెన్సీలో మేం బాగా సంపాదించామని మరొకరు.. ఇలా సోషల్‌మీడియాలో ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు మోసాలకుపపాల్పడుతునారు. ఏఐని ఉపయోగించి ప్రముఖుల వీడియోలతో పోస్టులు పెడుతూ చదువుకున్న అమాయకులను కూడా ఈజీగా బొల్తా కొట్టిస్తున్నారు. ప్రతిరోజూ సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కుతూ కోట్ల రూపాయలు పొగొట్టుకుంటున్న వారిలో చాలామంది సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ఆకర్షితులవుతున్న వారే ఉన్నారు. ఇందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా నేరగాళ్లు వాడుకుంటున్నారు. గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లే కొందరు ట్రేడింగ్ వ్యాపారాలను కూడా ప్రమోట్ చేస్తున్నారు. సోషల్‌మీడియాలో సైబర్‌నేరగాళ్లు జోరుగా ప్రకటనలు ఇస్తున్నారు.
సోషల్‌మీడియాలో వచ్చే వీడియోలలో సైబర్‌నేరగాళ్లు ట్రేడింగ్‌కు సంబంధించిన ప్రకటనలూ ఇస్తుంటారు, ఇందులో సైబర్‌నేరగాళ్లు పక్కా ప్లాన్‌తో ప్రకటనలు ఇస్తున్నారు. ట్రేడింగ్ అంటే ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్లు, ఇలాంటి ప్రకటనలు చూడడంతో అందులో ఏదో కొత్తదనం ఉందంటూ ఆయా లింక్‌లను క్లిక్ చేస్తూ సైబర్‌నేరగాళ్లు చెప్పే అసాధారణ విషయాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. అందులో మార్ఫింగ్ వీడియోలు ఉంటున్నాయి. ఏఐని ఉపయోగిస్తూ ఆకర్షిస్తున్న వారూ ఉన్నారు. ఇలాంటి వీడియోలతో ప్రేరేపితమవుతూ ఆయా లింక్‌లను క్లిక్ చేసి సైబర్‌నేరగాళ్లు వేసే వలలో బాధితులు ఈజీగా చిక్కుతున్నారు. విదేశాలలో ఉంటూ సైబర్‌నేరగాళ్లు తమ పనులు కానిచ్చేస్తున్నారు.
సోషల్‌మీడియాను తమ మోసాలకు ఎలా వాడుకోవాలో సైబర్‌నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పంథాలను ఉపయోగిస్తూ మోసాలు చేస్తున్నారు. ట్రేడింగ్ మోసాలలో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రతిరోజూ కనీసం 10 కేసుల వరకు నమోదువుతున్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు బాధితులుగా ఉంటున్నారు. కొందరు ట్రేడింగ్ అంటుండగా, మరికొందరు క్రిప్టోలో యూఎస్డీటీపై పెట్టుబడి పెట్టండంటూ సూచనలు చేస్తూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు.
ట్రేడింగ్ మోసాలలో సైబర్‌నేరగాళ్లు చెప్పే మాటలే వారి పెట్టుబడి. మొదట్లో మాటలు చెప్పి అమాయకులను బుట్టలో వేశారంటే ఆ తరువాత బాధితుడే అందులో కూరుకుపోయి డబ్బులు పెట్టుబడి పెడుతూ మోసానికి గురవుతుంటాడు. ఇందుకు మొదట మాటలు, ఆ తరువాత వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లలో ట్రేడింగ్‌లో నిష్ణాతులైన వారితో చర్చలు, సూచనలంటూ మాయ మాటలు చెబుతుంటారు. అలాంటి గ్రూప్‌లలో సగం మంది సైబర్నేరగాళ్లే ఉంటారు. ఇలా అందులో కొత్తగా చేరిన వారిని ముగ్గులోకి దింపేందుకు ‘ట్రేడింగ్‌లో మేం సంపాదించాం, మీరూ సంపాదించవచ్చు’ అంటూ నమ్మకమైన మాటలు చెబుతారు. ఈ మాటలు వినే వారు మన అదృష్టాన్ని పరీక్షించుకుందామనే భావనతో మొదట్లో తక్కువ పెట్టుబడితో ట్రేడింగ్ మొదలు పెడుతారు. మొదటి సారే అందులో లాభాలొచ్చాయంటూ సైబర్‌నేరగాళ్లు బాధితులకు డబ్బులు ఇస్తారు. ఇక ఆ తరువాత నుంచి నెమ్మదిగా మోసంలోకి దింపుతుంటారు. ప్రధానంగా సోషల్‌మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్‌మీడియా గ్రూప్‌లలో ట్రేడింగ్ గురించి చర్చలు జరిపి అమాయకులను మోసం చేస్తుండడంతో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు టెక్ట్స్ మెసేజ్‌లు, వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్‌లు పంపిస్తూ అమాయకులను ఆకర్షిస్తున్న ఘటనలు చాలా ఉంటున్నాయి. ఒకపక్క సోషల్‌మీడియాలో ప్రకటనలు.. మరో పక్క మెసేజ్‌లతో అమాయకులతోపాటు తెలివైన వాళ్లను సైతం ఈజీగా సైబర్‌నేరగాళ్లు బుట్టలో వేసుకుంటున్నారు. ఒకేసారి బల్క్‌గా టెలిగ్రామ్ గ్రూప్‌లో నెంబర్లను యాడ్ చేస్తూ వెళ్తుంటారు. ఆ గ్రూప్‌లో ఉండే వారిలో కనీసం 20 మంది వరకు సైబర్‌నేరగాళ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లే ఉంటాయి. అలాగే వాట్సాప్‌లోను అదే పరిస్థితి. ఆ 20 మంది తాము ఫలాన స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి ఒకే రోజులో ఇంత సంపాదించామని, ఇదిగో ప్రూప్స్ అంటూ నకిలీ గ్రాప్స్, నకిలీ అకౌంట్స్ స్టేట్మెంట్లు ఆయా గ్రూప్‌లలో పోస్టు చేస్తుంటారు.
ఇలాంటి వాటిని నమ్మేస్తూ అమాయకులు మోసపోతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనే వాళ్లు కొందరు.. ఆయా మెసేజ్‌లు నిజమని నమ్మేవాళ్లు మరికొందరు.. ట్రేడింగ్‌లో రూ.10 వేల వరకు పెట్టుబడిపెట్టి చూద్దాం.. వస్తే వస్తాయి.. పోతే పోతాయనే ధోరణితో సైబర్‌నేరగాళ్లు సూచించిన ఖాతాలలో పెట్టుబడి పెట్టే వాళ్లు ఉంటున్నారు. ఇలాంటి వాళ్లకు మొదట కొంత లాభం సూచిస్తూ .. తాము చెప్పింది నిజమని నమ్మిస్తూ లక్షల్లో సైబర్‌నేరగాళ్లు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. నేరగాళ్ల చేతికి చిక్కిన బాధితులు తాము పెట్టింది రాబట్టుకోవడానికి ఒకటికి పదింతలు పెట్టుబడి పెడుతూ ఆశకు పోయి లక్షలు, కోట్లలో మోసపోతున్నారు. ఇలాంటి సోషల్‌మీడియా, వివిధ రకాల మెసేజ్‌లను చూసి స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
వెంగళరావునగర్, నవంబర్ 16 :ఓ విద్యార్థి సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కి మోసపోయిన ఘటన ఎస్ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్.నగర్‌కు చెందిన విద్యార్థి పల్లా నరేంద్ర (22)కు ఈ నెల 1వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా చెప్పుకున్నాడు. ట్రూ కాలర్‌లో కూడా సైబర్ క్రైమ్ పోలీసుగానే కనబడటంతో విద్యార్థి నమ్మేశాడు. షేర్‌చాట్ నుంచి తమకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామని నరేంద్రను భయపెట్టాడు. ఫోన్లో మాట్లాడుతుండగా అవతలి నుంచి వాకీటాకీల శబ్దం కూడా వినిపిసు్ంతడటంతో బాధితుడు నిజమైన పోలీసులని నమ్మి భయపడ్డాడు. కేసును క్లోజ్ చేయాలంటే కొంత జరిమానా కట్టాలని చెప్పడంతో ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు 7 దఫాలుగా మొత్తం రూ.97,540 చెల్లించాడు. అనంతరం ఫోన్‌ను ఫార్మాట్ చేయాలని చెప్పడంతో ఫార్మాట్ కూడా చేశాడు. అ తరువాత తాను మోసపాయానని గ్రహించి బాధితుడు ఎస్ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాడు.
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తామని నమ్మించి ఓ బిల్డర్‌కు సైబర్‌నేరగాళ్ల రూ. 8.2 లక్షలు టోకరా వేశారు. ఎల్బీనగర్కు చెందిన బాధితుడు బిల్డర్ వృత్తిని కొనసాగిస్తూ నిర్మాణ రంగంలో తన వ్యాపారాభివృద్ధికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్రావు, వినయ్ అనే వ్యక్తులు వేరు వేరుగా తాము బిజినెస్ ప్రమోషన్స్ చేస్తామంటూ మెసేజ్‌లు పంపించారు. మొదట ఇలాంటి మెసేజ్‌లను బాధితుడు నమ్మలేదు. అయితే ఇద్దరు వ్యక్తులు వేరు వేరుగా తాము గతంలో చేసిన బిజినెస్ ప్రమోషన్స్ అంటూ కొన్ని వీడియోలు పంపించి, వాట్సాప్ కాల్స్ మాట్లాడారు.
వారి మాటలు నమ్మిన బాధితుడికి డిజిటల్లో బిజినెస్ ప్రమోషన్ చేస్తామంటూ ఒక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసి పంపించారు. మొదట కొంత డబ్బును బాధితుడు నేరగాళ్లు పంపించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశాడు. ఇలా తాము ప్రమోషన్స్ చేస్తున్నామని మీకు మంచి లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ దఫదఫాలుగా రూ.8.72 లక్షలు కాజేశారు. అందులో బాధితుడు రూ.51 వేల వరకు తిరిగి రాబట్టుకోగలిగాడు. ఆ తరువాత నేరగాళ్లు ఫోన్లు స్వీచాఫ్ చేయడంతో పక్కా ఫ్లాన్‌తో తనను మోసం చేశారని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.