సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మ్యాట్రీమోనీ సైట్లో మహిళగా పరిచయమై పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ.17.90 లక్షలు మోసం చేశారు. బోయిన్‌పల్లికి చెందిన ప్రవీన్ అనే ఓ ప్రైవేట్ ఉద్యోగి షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేసి పెండ్లి సంబంధం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రొఫైల్ చూసిన ఓ మహిళ తాను లండన్‌లో ఉంటానంటూ ఇంటర్నెట్ ఆధారిత కాల్స్‌తో వాట్సాప్ కాల్ మాట్లాడింది. తనకు నీ ప్రొఫైల్ నచ్చిందని పెండ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ అందమైన ఫొటోలను పంపించింది. ఆమె ఫొటోలను చూసిన బాధితుడు పెండ్లికి ఒప్పుకున్నాడు. అయితే అన్ని విషయాలు మాట్లాడేందుకు నేనే నిన్ను స్వయంగా వచ్చి కలుస్తానంటూ నమ్మించింది.
వారం రోజుల వ్యవధిలోనే బాధితుడికి ఆమె ఫోన్ చేసి, తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆపేశారని, తాను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వీళ్లకు ఇక్కడ అర్ధం కావడం లేదంటూ అక్కడున్న మహిళతో మాట్లాడి సమస్య తెలుసుకొమ్మని చెప్పి, ఫోన్‌ను మరో మహిళతో మాట్లాడించింది. కస్టమ్స్ క్లియరెన్స్ లేదని ఫెనాల్టీ చెల్లించాలని మేం చెబుతుంటే ఆమె వినిపించుకోవడం లేదంటూ మాట్లాడారు. దీంతో బాధితుడు ఆ ఫెనాల్టీ నేనే చెల్లిస్తానంటూ రూ.80 వేలు చెల్లించాడు. ఆ తరువాత ఆమె వద్ద పౌండ్లు, ఆభరణాలు కూడా ఉన్నాయని వాటికి కూడా క్లియరెన్స్ లేదంటూ రకరకాల కారణాలు చూపిస్తూ రూ.17.90 లక్షలు వసూలు చేశారు. ఇంకా కారణాలు చెబుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.