సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఖాళీగా ఉన్నారా? ఇంట్లో కూర్చొని రోజూ రూ.3 వేలు సంపాదించవచ్చంటూ మెసేజ్‌లు పంపుతూ సైబర్‌నేరగాళ్లు అమాయకుల వద్ద నుంచి లక్షలు దోపిడీ చేస్తున్నారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన సమీనాబేగానికి టాస్క్మాల్తో రోజుకు రూ.3 వేలు సంపాదించవచ్చంటూ మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్ చూసిన ఆమె టాస్క్మాల్ యాప్‌ను డౌన్లోడ్ చేసింది. అందులో రూ.100 చెల్లించి, కొన్ని టాస్క్‌లు పూర్తి చేయగానే వెంటనే రూ.200 వచ్చాయంటూ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె రూ.1200 పెట్టుబడి పెట్టింది. కొద్ది సేపటికి రూ.1800 రాబడి రాగా.. సింపుల్ టాస్క్‌లతో ఈజీగా మనీ వచ్చేస్తుందని నమ్మి పెట్టుబడి పెంచుతూ పోయింది. లాభం వచ్చినట్లు యాప్ స్క్రీన్‌పై కనిపిస్తున్నా విత్ డ్రాకు అవకాశం లేకపోవడంతో ఆమె కస్టమర్ సపోర్టుకు ఫోన్ చేసింది. ఇంకా పెట్టుబడి పెడితే ఒకేసారి అన్ని విత్ డ్రా చేసుకోవచ్చని నమ్మించి రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. దీంతో బాధితురాలు మంగళవారం సీసీఎస్ సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చాదర్‌ఘాట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తన అమ్మమ్మ ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు 99ఎకర్స్.కామ్‌లో ప్రకటన ఇచ్చింది. దీంతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము ఆర్మీ సిబ్బందిమంటూ పరిచయం చేసుకొని ఇంటిని కిరాయికి తీసుకుంటామని నమ్మించారు. అయితే ఆన్లైన్ అడ్వాన్స్ చెల్లిస్తామంటూ క్యూ ఆర్ కోడ్ పంపారు. ఇందులో పే ఆప్షన్ ఉండటంతో ఆ యువతి రూ.20 వేలు పంపింది. దీంతో పొరపాటు తమ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని తిరిగి పంపిస్తామని క్యూ ఆర్ కోడ్లు పంపి మొత్తంగా రూ.4.38 లక్షలను సైబర్ నేరగాళ్లు ఆమె ఖాతా నుంచి కొట్టేశారు.