కొండాపూర్, ఆగస్టు 17: ప్రతి పౌరుడు పోలీసేనని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం మాదాపూర్లోని ఓ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరోనా విజృంభణ తర్వాత ప్రతిఒక్కరిలో మార్పు వచ్చిందన్నారు. లాక్డౌన్తో ఆన్లైన్ సేవలు విస్తృతమయ్యాయని అన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెర లేపుతున్నారని అన్నారు. మోసపూరిత ప్రకటనలకు అనేక మంది ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఆలోచించి అడుగేస్తే సైబర్ నేరాలను అడ్డుకోవచ్చని అన్నారు. 1912లో నగరంలో సైకిల్ పెట్రోలింగ్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం సైబర్ పెట్రోలింగ్ స్థాయికి చేరిందన్నారు. వందేండ్లకు పైగా ఉత్తమ సేవలందించిన ఘనత నగర పోలీసులదని అన్నారు. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ వ్యాన్ను ఏర్పాటు చేసి హైదరాబాద్ పోలీసులు ఉత్తమ సేవలు అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ఉమా, ఎఫ్ఎల్ఓ ప్రతినిధులు పాల్గొన్నారు.