రాకేశ్ ఐటీ ఉద్యోగి. నెల కిందట తొలుత ఓ యాప్‌లో రూ.5 వేలు పెట్టుబడి పెట్టాడు. దీనికి రూ.2500 లాభం వచ్చింది. మరో 5 వేలు పెడితే మళ్లీ 2500 లాభం వచ్చింది. ఈ సారి 50 వేలు పెట్టగా 25,000 లాభం వచ్చింది. ఈ లాభాలన్నీ విత్‌డ్రా చేసుకోగలిగాడు. బాగా లాభాలు వస్తాయన్న నమ్మకంతో ఇక లక్షల్లో జమ చేస్తూ వెళ్లిపోయాడు. అలా మొత్తంగా 10 లక్షలు జమ చేయగా ఈసారి 2.5 కోట్ల లాభం యాప్ స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ఎగిరిగంతేశాడు. కానీ స్క్రీన్‌పై కనబడ్డ లాభాన్ని విత్‌డ్రా చేసుకోలేకపోయాడు. దీంతో యాప్ కాల్‌సెంటర్‌ను సంప్రదించగా మరో 10 లక్షలు పెట్టుబడి పెట్టాలని, మొత్తంగా లాభం 5 కోట్లు కాగానే విత్‌డ్రా చేసుకోవచ్చని నమ్మించారు. దీంతో రాకేశ్ పోలీసులను ఆశ్రయించాడు. అదంతా మోసమని యాప్ ట్రాప్‌లో పడొద్దని రాకేశ్‌కు పూసగుచ్చినట్లు చెప్పి పంపారు. అయినా రాకేశ్‌కు మాత్రం పోలీసుల మాటకంటే కూడా యాప్ నిర్వాహకుల అబద్ధమే బాగా నమ్మకం కలిగించింది. ఈసారి యాప్ వారు చెప్పినట్టుగానే మరో 10 లక్షలు పెట్టుబడి పెట్టి 5 కోట్ల లాభం కోసం ఎదురుచూశాడు. కానీ విత్ డ్రా ఆప్షన్ మాత్రం యాక్టివేట్ కాలేదు. దీంతో లబోదిబోమంటూ రాకేశ్ మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల నగరంలో ఇలా ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
ఇలా మోసపోతున్న వారిలో బీటెక్ విద్యార్థులు.. ఐటీ ఉద్యోగులుకూడా ఉండటం గమనార్హం. సులువుగా డబ్బులు సంపాదించాలని అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సులువుగా చిక్కుతున్నారు. కష్టపడకుండా ఏదీ రాదని తెలిసి కూడా మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తూ చేజేతులా కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. సైబర్ దొంగలు తొలుత స్వల్ప పెట్టుబడి పెట్టించి లాభం చూపించి విత్‌డ్రా (ఉపసంహరణ) చేసుకోమంటారు. ఆ తర్వాత పెట్టుబడి మొత్తాన్ని పెంచమని చెప్పి విత్‌డ్రా ఆప్షన్‌ను తీసేసి కేవలం కంప్యూటర్లో అంకెల గారడీ చేస్తారు. విత్‌డ్రా ఆప్షన్ తెరిపించండి ప్లీజ్ అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మోసమని చెప్పినా వినకుండా సైబర్ మోసగాళ్ల మాయలో పడి చివరకు లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తున్నారు.
“సార్ నేను ఓ చిన్న కంపెనీలో రూ.50 వేల పెట్టుబడి పెట్టా. మొదట కొంత లాభం వస్తే విత్‌డ్రా చేసుకున్నా. తర్వాత మరికొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే లాభం రూ.3.50 లక్షలుగా చూపిస్తున్నా తీసుకో రావడం లేదు.” ఈ విషయంలో ఏదైనా సాయం చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఓ బీటెక్ చదివిన యువతి కోరింది. ఇదంతా మోసమని.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు వివరించారు. అయితే తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన ఆ యువతి పెట్టుబడి లింక్ చూసుకోగా మరో లక్ష రూపాయలు పెరిగాయి. ఇంకొంచెం నగదును పెడితే లాభం ఐదు లక్షలు దాటుతుందని అప్పుడే మెసేజ్ రావడంతో వెంటనే మరో రూ.10 వేలు డిపాజిట్ చేసింది. లాభం స్క్రీన్‌పై కనబడినా విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోవడంతో చివరికి చేసేది లేక ఆ యువతి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది.
సిటీబ్యూరో, అగస్టు 17 (నమస్తే తెలంగాణ): చిన్న మొత్తం పెట్టండి.. భారీ లాభాలు పొందండి అంటూ సైబర్ నేరగాళ్లు చేస్తున్న ప్రచారానికి ఎందరో అమాయకులు బలి అవుతున్నారు. ఇది పెద్ద మోసమని పోలీసులు చెబుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న లాభాల మాయలో పడుతున్న కొందరు తిరిగి ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. పోలీసులను ఆశ్రయిస్తూ ఫిర్యాదు చేయకుండా విత్ డ్రా ఆప్షన్‌ను తెరిపించాలని కోరుతున్నారు. రోజురోజుకూ ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న కేసులపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలా సైబర్‌నేరాల్లో మోసపోతున్న వారిలో మహిళలు అధికంగా ఉండటం కలవరం రేపుతున్నది.
ఇంట్లోనే కూర్చొని ఉద్యోగం చేయండి.. రోజుకూ రూ.3 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించవచ్చని అమాయకులకు సైబర్ నేరగాళ్లు బల్క్ మేసేజ్‌లు పంపుతున్నారు. ఎవరైనా ఈ మెసేజ్‌లకు స్పందిస్తే వారు వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లలోని గ్రూపుల్లో చేరుస్తున్నారు. ఆ తర్వాత వారితో మాటలు కలిపి తమ సంస్థల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు. లింక్‌లు పంపుతూ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తున్నారు. మొదట రూ.500 నుంచి ప్రారంభించి రూ.5000 వరకు పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు చూపిస్తూ విత్‌డ్రా అవకాశం కల్పిస్తున్నారు. పెద్ద మొత్తం డిపాజిట్ చేస్తే మాత్రం లాభం చూపిస్తున్నా విత్ డ్రా ఆప్షన్‌ను తొలగిస్తున్నారు.
విదేశాల్లో తయారు చేయించిన సాఫ్ట్వేర్ సాయంతో సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చైనా, హంగ్‌కాంగ్, సింగపూర్ దేశాల నుంచి హ్యాండిల్ చేస్తున్నట్లు సమాచారం. చిన్నచిన్న డిపాజిట్లకు విత్‌డ్రా ఆప్షన్లు ఇచ్చి మన దేశంలోనే ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ఖాతాల్లో వాటిని జమ చేస్తున్నారు. భారీ మొత్తంలో డిపాజిట్లు స్వీకరించినప్పుడు మాత్రం డిజిటల్ ప్లాట్‌ఫాంపై బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ, డాలర్లను కొనుగోలు చేయించి వాటిని విదేశాల్లో ఉండే ఖాతాలకు బదిలీ చేయిస్తున్నారు. వీటిపై దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారాలు దొరకడం లేదని సైబర్ క్రైం పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ఇంట్లో కూర్చొని సంపాదన అనగానే ఆశపడవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు మోసపూరితమని గ్రహించాలని కోరుతున్నారు. ఉద్యోగమని.. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటూ మాట్లాడితే కచ్చితంగా మోసమని గుర్తించాలంటున్నారు. వంద సార్లు ఆలోచించి ప్రత్యక్షంగా కనబడే కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టాలని.. ఆన్లైన్లో గుర్తు తెలియని కంపెనీలతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.