‘మేం సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం.. మీ సిమ్ కార్డు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే బ్లాక్ అవుతుందం’టూ ఓ వ్యక్తితో ఆగంతకులు మాట్లాడారు. అప్‌గ్రేడ్ కోసం రూ. 10 ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. దీనికి క్విక్ సపోర్టు యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే.. ప్రాసెస్ మేం చెబుతామంటూ నమ్మించి, ఆ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయించారు. ఆ తరువాత యాప్ కోడ్‌ను తీసుకొని, ఇంటర్నెట్ బ్యాంకు ద్వారా చెల్లించాలంటూ సూచించడంతో వారు చెప్పినట్లు చేశాడు. క్విక్ సపోర్టుతో బాధితుడి సెల్‌ఫోన్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు అతడి ఖాతాలో నుంచి రూ. 3.5 లక్షలు కాజేశారు.
జీడిమెట్ల డివిజన్ ఎంఎన్‌రెడ్డి నగర్ కాలనీకి చెందిన ఒనపాకల రాజ్‌కుమార్(34) వృత్తి రీత్యా లెక్చరర్. లక్కీస్టార్ ఇన్స్టాల్ చేసుకుంటే అధిక లాభాలు వస్తాయని స్నేహితుడు చెప్పడంతో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో కొంత డబ్బులు పెట్టుబడి పెట్టగా, తొలుత లాభాలు వచ్చాయి. ఆ తర్వాత ఖాతా నుంచి రూ. 2.11 లక్షలు పోయ్యాయి. బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 2, కమలాపురి కాలనీ ఫేజ్- 1లో నివాసముంటున్న వీఎస్ గణేశ్ అనే వ్యక్తి సీఏగా పనిచేస్తున్నాడు. అతడికి గత నెల 24న గుర్తు తెలియని నంబర్ నుంచి ఆన్లైన్లో బహమతి వచ్చిందంటూ.. ఎస్ఎంఎస్ వచ్చింది. మెసేజ్‌ని ఓపెన్ చేయడంతో పాటు అందులోని లింక్‌ను తెరవడంతో ఓటీపీ నంబర్ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే మూడు విడతలుగా మొత్తం రూ.65వేల నగదు ఖాతా నుంచి విత్‌డ్రా అయ్యాయి. విషయాన్ని బ్యాంక్ అధికారులకు చెప్పి అకౌంట్‌ను బ్లాక్ చేయించిన గణేశ్.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.