కుత్బుల్లాపూర్, ఆగస్టు7: జనం అత్యాశ..అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దోపిడీ పర్వాన్ని కొనసాగిసున్నారు సైబర్‌నేరగాళ్లు. తాజాగా మరోసారి పంజా విసిరి ఖాతాలు కొల్లగొట్టారు. జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్‌కు చెందిన రాకేశ్(38)కు గత నెల 14న తన వాట్సాప్‌కు బీటీసీ వీఐపీ పేరిట సందేశం వచ్చింది. అనంతరం ఓ వ్యక్తి ఫోన్ చేసి తన పేరు అమంత అని పరిచయం చేసుకున్నాడు. రాకేశ్‌ను బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాలని సూచించాడు. దీంతో అతడు మొదటగా రూ.10 వేలు ఇన్వెస్ట్ చేయగా, కొంత సొమ్ము వచ్చింది. మరికొంత డబ్బులను డిపాజిట్ చేశాడు. మళ్లీ లాభం రావడంతో రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అనంతరం కొంచెం కొంచెం డబ్బు పోవడం మొదలయ్యాయి. మిగతా నగదు విత్‌డ్రా చేసేందుకు రాకేశ్ ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. దీంతో బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షాపూర్‌నగర్ హెచ్ఎంటీ సొసైటీకి చెందిన యాదగిరి వ్యాపారి. గత 15 రోజుల కిందట క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకొని.. కార్డు అప్డేట్ చేయాలంటూ అందుకు పూర్తి వివరాలు తెలపాలని సూచించి.. ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను తెలుసుకున్నాడు. ఆ వెంటనే మొత్తం రూ.96 వేల డ్రా అయినట్లు సందేశం వచ్చింది. తిరిగి సదరు నంబర్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపారు.
గోల్నాక, ఆగస్టు 7: బాగ్‌అంబర్‌పేటకు చెందిన ఉషా సుబ్రమణ్యం(62) రిటైర్డ్ ఉద్యోగి.. గత నెల 29వ తేదీ సాయంత్రం ఆమె సెల్ ఫోన్‌కు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చింది. బ్యాంకు నుంచి వచ్చిందనుకొని వివరాలను అప్లోడ్ చేసింది. వెంటనే బ్యాంకు ఖాతా నుంచి రూ.65వేల నగదు మాయమైంది. నగదు డ్రా చేసుకున్నట్లు ఫోన్లో వచ్చిన సందేశాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు.. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్‌పేట ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.