బంజారాహిల్స్, ఆగస్టు 6: ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువును ఎక్సేంజ్ చేసే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు ఎరవేసి రూ.60వేలు కాజేశారు. బంజారాహిల్స్‌లో ఉద్యోగం చేస్తున్న బాలకృష్ణ ఇటీవల ఓ యాప్ ద్వారా నాయిస్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేశాడు. అవి సరిగా పనిచేయకపోవడంతో వెనక్కి పంపించే క్రమంలో ఆ అప్లికేషన్‌కు సంబంధించిన కస్టమర్ కేర్ కోసం గూగుల్‌లో వెతికాడు. ఓ మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయగా, ఓటీపీ వచ్చింది. ఆ నంబర్‌ను తమకు చెబితే ప్రొడక్ట్ ఎక్సేంజ్ చేస్తామని ఆగంతకులు నమ్మబలికారు. నంబర్ చెప్పగానే ఖాతా నుంచి రూ.60వేలు గుర్తుతెలియని బ్యాంక్ ఖాతాకు పంపించుకున్నారు. బాధితుడు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేపట్టారు.