సిటీబ్యూరో, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): రూ. 12 కోట్ల సైబర్ దోపిడీ కేసు దర్యాప్తు సరిహద్దులు దాటనున్నది. పశువుల వ్యాక్సిన్ నూనెలంటూ వృద్ధ వైద్యుడిని భారీ మొత్తంలో మోసం చేసిన సైబర్నేరగాళ్లను పట్టుకోవడం సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు చాలెంజ్‌గా మారింది. బాధితుడు అమెరికన్ సిటిజన్ కావడంతో అక్కడ సైతం ఫిర్యాదు చేయాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ఆ క్రమంలో అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగుతాయి. అక్కడి నుంచి సమాచారం ఇండియాకు వస్తే.. నిందితులను పట్టుకునే అవకాశాలుంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఎన్ఆర్ఐ అయిన అమీర్‌పేట్‌కు చెందిన వైద్యుడు సీవీరావుకు పశువుల వ్యాక్సిన్‌లో ఉపయోగించే అగ్రోమెటిజమ్ అనే నూనెను పంపిస్తామంటూ సైబర్ నేరగాళ్లు నాలుగు నెలల్లో రూ. 12 కోట్లు తస్కరించిన ఘటన తెలిసిందే. అమెరికా, లండన్‌లో ఉన్న తొమ్మిది బ్యాంకు ఖాతాలకు బాధితుడు డాలర్లను బదిలీ చేశాడు. ఆగంతకులు ఎక్కడ కూడా సెల్, ల్యాండ్ ఫోన్లు వాడలేదు. ఇంటర్నెట్ నుంచి వర్చువల్ నంబర్లతోనే మాట్లాడారు. సైబర్ కేసుల దర్యాప్తులో ప్రధాన ఆధారం బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్, ఐపీ అడ్రస్‌లే కీలకం. నేరగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని మార్గాల్లో అన్వేషిస్తున్నారు.