దురాశ దుఃఖానికి చేటు అంటారు.. అత్యాశ పడితే చివరికి మిగిలేది బాధే.. అనేది ఆ సామెత సారాంశం. కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలని చేస్తున్న ఆలోచనలు.. సైబర్ నేరగాళ్లకు ఆదాయ వనరుగా మారుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో వారు చీటింగ్‌కు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకొని అడ్డంగా దోచేస్తున్నారు. ఆన్లైన్లో పెట్టుబడి పెడితే.. మంచి లాభాలు వస్తాయంటే.. నమ్మి చీటర్ల చేతిలో చిక్కి.. లక్షలు పోగొట్టుకుంటున్న వారి ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ట్రేడింగ్ పేరుతో సోషల్‌మీడియాలో ఆకట్టుకునే ప్రకటనలు ఇచ్చి.. ఊబిలోకి లాగుతున్న ఆగంతకులు.. చిన్న మొత్తంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు వస్తుందని ఆశ కల్పించి.. ఎంతో కొంత డిపాజిట్ చేయించుకుంటున్నారు. లాభాలు చూపించి..ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించి.. విత్‌డ్రా లింక్‌లు తొలగించేస్తున్నారు.
డబ్బులు వచ్చినట్లు మెసేజ్‌లు చూపినా.. డ్రా చేసుకునే వీలు లేకుండా పోతున్నది. ఇలా అనేక మంది ఈజీ మనీ కోసం ఆరాటపడి.. దారుణంగా మోసపోయి.. ఆర్థికంగా చితికిపోతున్నారు.త్వరగా డబ్బు సంపాదించాలి.. ఆన్లైన్లో ఈజీగా ఎంతో కొంత పెట్టుబడి పెడితే.. మంచి లాభాలొస్తాయనే అపోహాతో చాలా మంది సైబర్‌నేరగాళ్ల చేతిలో చిక్కి లక్షలు పోగొట్టుకుంటున్నారు. కేటుగాళ్లు ట్రేడింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తున్నారు. పెట్టుబడులు పెట్టించి మోసం చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌లు, వెబ్సైట్లు తయారు చేస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ..ఊబిలోకి లాగుతున్నారు. ఇలా మోసానికి గురవుతున్న వారిలో రోజుకు ఒకరిద్దరు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పెట్టుబడులకు రెట్టింపు లాభాలంటే అనుమానించండి.. అలాంటి ప్రకటనల యాప్‌లు, వాట్సాప్ మెసేజ్‌లను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
మీర్‌పేట్‌కు చెందిన ఓ ఉద్యోగిని ఎంజీ ఆన్లైన్, విన్నర్ యాప్‌లలో చిన్నచిన్న పెట్టుబడులు పెట్టి సుమారు పది వేల వరకు లబ్ధి పొందింది. ఆ తర్వాత యాప్‌ల నిర్వాహకులు తరచూ ఫోన్లు చేసి.. ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే..భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో రూ. 5.56 లక్షలు డిపాజిట్ చేసింది. మరుక్షణమే విత్‌డ్రా ఆప్షన్ డిసెబుల్ అయింది. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
పెట్టుబడులు పెడితే భారీ లాభాలొస్తాయంటూ.. సోషల్‌మీడియాలో వచ్చిన ప్రకటనలకు ఆకర్షితులైన 20 మంది.. రూ. 8 లక్షలు పోగొట్టుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తితో పాటు మరికొందరు లక్కీ స్టార్, గోల్డ్ వింగ్ అనే పేరుతో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.
మొఘల్‌పురా వాసి ఫేస్బుక్లో ఇన్వెస్ట్మెంట్ ప్రకటనను చూసి.. ఓ వెబ్‌సైట్‌ను క్లిక్ చేశాడు. నిర్వాహకుల సూచనతో రూ. 10 వేలు చెల్లించాడు. స్క్రీన్‌పై మరుసటి రోజు రూ. 20 వేలు కన్పించాయి. వాటిని డ్రా చేసుకునేందుకు వీలు లేదనే షరతు ఉంది. ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ.. సూచనలు రావడంతో…మరింత డిపాజిట్ చేసి మొత్తం రూ. 2.4 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన గుర్తుతెలియని వ్యక్తులు ట్రేడింగ్ అండర్ స్కోర్ హబ్ 1 పేరుతో యాప్‌ను డౌన్లో చేయించి రూ. లక్ష పెట్టుబడి పెట్టించారు. మరో మూడు లక్షలు కడితే.. ఒకేసారి అన్ని డ్రా చేసుకోవచ్చంటూ.. సూచించారు. మోసాన్ని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఖైరతాబాద్‌కు చెందిన ఒకరు తన స్నేహితుల ద్వారా ఈబే505.కామ్ అనే వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టాడు. చిన్నమొత్తంలో డబ్బులు పెట్టగా, లాభాలొచ్చాయి. వెబ్సైట్ నిర్వాహకుల సూచనలతో రూ. 1.49 లక్షలు డిపాజిట్ చేశాడు. వెంటనే వారి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
గజియాబాద్‌కు చెందిన దేవన్ష్ రస్తోగి , అతడి స్నేహితుడు మంజీత్ చౌదరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇద్దరు కలిసి ఇన్సూరెన్స్ పేరుతో అమాయకులను మోసం చేయాలని ప్లాన్ చేశారు. గతేడాది బేగంపేటకు చెందిన 80 ఏండ్ల వృద్ధురాలికి దేవాన్ష్ రస్తోగి ఫోన్ చేశాడు. తాను రాజీవ్ అగర్వాల్ మాట్లాడుతున్నానని, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లర్క్‌గా పనిచేస్తున్నానంటూ చెప్పుకున్నాడు. ‘మీరు మా వద్ద ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే.. భారీగా బోనస్ వస్తుందం’టూ నమ్మించాడు. దీంతో ఆమె నాలుగు పాలసీలు తీసుకున్నది.
తరువాత ఆమెకు ఫోన్ చేసి.. మీకు బోనస్ వచ్చిందని, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ కోసం కొంత ఫీజు చెల్లించాలంటూ చెప్పాడు. ఆమె వద్ద నుంచి వివిధ ఫీజుల రూపంలో రూ. 15,37,622 లాగేశాడు. ఇందుకు గజియాబాద్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ బ్యాంకు ఖాతాను వాడుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కృష్ణ బృందం దర్యాప్తు చేపట్టింది. గజియాబాద్‌కు ప్రత్యేక బృందం వెళ్లి ప్రధాన నిందితుడు దేవన్ష్తో పాటు బ్యాంకు ఖాతాదారుడు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు జాయింట్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు.
యాప్‌లు, ట్రేడింగ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో ఇటీవల మోసపోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నది. ట్రేడింగ్‌లో అనుభవం ఉన్న వారు సొంతంగా డీ మాట్ ఖాతాను ఓపెన్ చేసి.. ట్రేడింగ్ చేస్తారు. అయితే సైబర్‌నేరగాళ్లు స్వయంగా ట్రేడింగ్ చేస్తామంటూ.. నమ్మించి పెట్టుబడులు పెట్టించి, వాటిని తమ సొంతానికి మళ్లిస్తుంటారు. పెట్టుబడుల పేరుతో వచ్చే ఫోన్స్, ఈ-మెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, వెబ్‌సైట్స్, యాప్‌లను నమ్మొద్దు. -కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సీసీఎస్ సైబర్‌క్రైమ్స్